Telugu Global
Telangana

రాష్ట్రం పని చేయకుంటే లా అండ్‌ ఆర్డర్‌ బాధ్యత కేంద్రం తీసుకుంటది

రేవంత్‌ సర్కార్‌ కు ఈటల రాజేందర్‌ ఘాటు హెచ్చరిక

రాష్ట్రం పని చేయకుంటే లా అండ్‌ ఆర్డర్‌ బాధ్యత కేంద్రం తీసుకుంటది
X

రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ ఘాటు హెచ్చరికలు చేశారు. ఖమ్మం పట్టణంలో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని గురువారం ఈటల రాజేందర్‌ ఆవిష్కరించి మాట్లాడారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌ లో కొన్ని రోజులుగా అశాంతి పెరుగుతోందని, చాలా రోజుల తర్వాత నగరంలో భయానక వాతావరణం నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తే కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఆ బాధ్యత తీసుకుంటుందని తేల్చిచెప్పారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం లా అండ్‌ ఆర్డర్‌ పరిరక్షించడంలో పూర్తిగా ఫెయిల్‌ అయ్యిందని తేల్చిచెప్పారు. దేశ ప్రజలు స్వేచ్ఛ, ప్రేమ, శాంతి ఎదుగుదలను కోరుకుంటారే తప్ప అశాంతిని ఎప్పటికీ కోరుకోరని తెలిపారు. దేశ ప్రజలందరూ ఆరాధించే మహనీయుడు ఛత్రపతి శివాజీ అని.. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించినందుకు గర్వంగా ఉందన్నారు. కులం, మతం, పార్టీ, జెండా తేడా లేకుండా ఆడబిడ్డలు బతుకమ్మలతో ఘన స్వాగతం పలికారని.. వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నానని అన్నారు. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం ఎలా ఐక్య పోరాటాలు చేశామో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు.

రెండు నెలలుగా హైదరాబాద్‌ లో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. శాస్త్రీపురంలో అమ్మవారి ఆలయంపై దాడి చేశారని.. అది ఎవరో సైకోలు, పిచ్చోళ్లు చేసిన దాడి కాదని.. కొందరు పథకం ప్రకారమే హిందువుల ఆత్మగౌరవాన్ని, విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు దాడి చేశారని అన్నారు. ఓల్డ్‌ సిటీలో, మైలార్‌ దేవ్‌ పల్లిలో, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ సమీపంలోని అమ్మవారి ఆలయాలను టార్గెట్‌ చేసి దాడులు చేశారని అన్నారు. ప్రభుత్వం మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎంక్వైరీకి ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసి బాధ్యులను గుర్తించి శిక్షించాలన్నారు. కొందరు ఒకవర్గం వారిని కూడగట్టి హిందూ ధర్మం, విశ్వాసానికి వ్యతిరేకంగా వారిలో విషం నింపుతున్నారని అన్నారు. ఇలాంటి వాటికి ప్రభావితమైన వ్యక్తే సికింద్రాబాద్‌ లో అమ్మవారి ఆలయంపై దాడికి పాల్పడినట్టుగా పోలీసులు నిర్దారించారని తెలిపారు. ఇలాంటి ఘటనలతో శాంతిభద్రతలు దెబ్బతినే ప్రమాదముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌ గా తీసుకోకపోతే హైదరాబాద్‌ ప్రతిష్ట దెబ్బతింటుందని, పరిస్థితి అంతవరకు వస్తే లా అండర్‌ ను కంట్రోల్‌ చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి వెనుకాడబోదన్నారు. తన వ్యాఖ్యల ద్వారా రేవంత్‌ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగకపోతే అవసరమైతే రాష్ట్రపతి పాలన పెట్టడానికి కూడా కేంద్రం వెనుకాడబోదన్న సంకేతాలను ఈటల రాజేందర్‌ ఇచ్చారు.

First Published:  17 Oct 2024 3:57 PM IST
Next Story