Telugu Global
Telangana

పేపర్ లీక్ చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరిక

పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

పేపర్ లీక్ చేస్తే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం : మంత్రి సబితా ఇంద్రారెడ్డి హెచ్చరిక
X

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు తెలుగు, రెండో రోజు హిందీ పరీక్షలు జరుగగా.. వాటికి సంబంధించిన ప్రశ్నాపత్రాలు వాట్సప్‌లో చక్కర్లు కొట్టాయి. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉన్నది. రెండు రోజుల పాటు ఇలా ప్రశ్నాపత్రాలు వరుసగా సోషల్ మీడియాలో వైరల్ కావడంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడే వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఆమె హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని చెప్పారు.

పదో తరగతి ప్రశ్నాపత్రాలు వాట్సప్‌లో ప్రత్యక్షం కావడంతో.. పరీక్షల నిర్వహణపై ఆమె అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బీఆర్కే భవన్‌లో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీక్ కాలేదని, ఈ విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. మిగిలిన 4 పరీక్షల నిర్వహణలో కఠిన చేపట్టాలని కలెక్టర్లు, ఎస్పీలకు సూచించారు. పరీక్షల నిర్వహణలో 55 వేల మంది అధికారులు, సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. వీళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు కేంద్రాల్లోకి తీసుకెళ్లకూడదని ఆదేశించారు. ఆయా పరీక్షా కేంద్రాల బాధ్యలు ఇటు వంటి వాటిని అనుమతించవద్దని చెప్పారు.

పేపర్ల రవాణా విషయంలో కూడా మరింతగా భద్రతా చర్యలు తీసుకోవాలని, కేంద్రాల ద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసేయించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేలా ప్రతిపక్షాలు దుందుడుకుగా వ్యవహరిస్తున్నాయని సబిత ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ను బద్నాం చేయడానికి విద్యార్థులను పావుగా ఉపయోగించుకోవడం ప్రతిపక్షాలకు తగదని మంత్రి సబిత సూచించారు. రాజకీయ లబ్ధి పొందాలని అనుకోవడం వారి దివాళాకోరు విధానానికి నిదర్శనమని చెప్పారు.

ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో బలి కావొద్దని విద్యార్థులు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రెండు ప్రశ్నాపత్రాలు లీకైనట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. అవి పరీక్షలు మొదలైన తర్వాతే బయటకు వచ్చాయని.. ఇది పేపర్ ఔట్ అని ఆమె అన్నారు.

కాగా, గురువారం నుంచి విధుల్లో ఉన్న సిబ్బంది, ఇన్విజిలేటర్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. సెల్‌ఫోన్లు వెంట తెచ్చినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. పరీక్ష కేంద్రాలను నో మొబైల్ జోన్‌గా ఉండేలా చూస్తారు. స్మార్ట్ వాచ్‌లను సైతం తీసుకొని రాకూడదు. ఈ బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ అధికారులదే అని మంత్రి చెప్పారు. పరీక్ష ప్రారంభమై ముగిసే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సిబ్బంది బయటకు వెళ్లకూడదని.. టీ, శీతల పానియాలంటూ అవసరాల కోసం బయటకు రావొద్దని స్పష్టం చేశారు.

First Published:  5 April 2023 1:45 AM GMT
Next Story