Telugu Global
Telangana

జోకర్లను ఎన్నుకుంటే మిగిలేది ఇదే.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ట్వీట్‌

భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఇచ్చే ఉపకార వేతనాల్లో భారీగా కోత విధిస్తున్నట్లు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.

జోకర్లను ఎన్నుకుంటే మిగిలేది ఇదే.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ట్వీట్‌
X

కర్ణాటకలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతులకు ఇచ్చే కరెంటు విషయంలో బీఆర్ఎస్‌ విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఇచ్చే ఉపకార వేతనాల్లో కోత విధిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కేటీఆర్ స్పందించారు. జోకర్లను ఎన్నుకుంటే మిగిలేది సర్కస్ మాత్రమే అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు కర్ణాటక క్లాసిక్ ఎక్జాంపుల్ అంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. స్కాంగ్రెస్‌ని తిరస్కరించి ప్రగతికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.


భవన నిర్మాణ కార్మికుల పిల్లలకు ఇచ్చే ఉపకార వేతనాల్లో భారీగా కోత విధిస్తున్నట్లు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కార్మికశాఖ దగ్గర తగినన్ని నిధులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు వేలమంది విద్యార్థులు తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతున్నారు.


2022-23 సంవత్సరానికి దాదాపు 13 లక్షల మంది విద్యార్థుల నుంచి స్కాలర్‌షిప్‌ కోసం కార్మిక శాఖకు దరఖాస్తులు రాగా.. 7 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించింది. స్కూల్‌ లెవల్‌ నుంచి ఉన్నత విద్య వరకు అందించే ఈ స్కాలర్‌షిప్‌లలో దాదాపు 80-85 శాతం కోత విధించాలని కర్ణాటక కార్మికశాఖ నిర్ణయించింది. దీంతో ఇంజినీరింగ్, మెడికల్‌ చదివే విద్యార్థులు తీవ్రంగా నష్టపోనున్నారు.

ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏటా రూ.60వేల స్కాలర్‌షిప్‌ అందుకోవాల్సి ఉండగా.. దాన్ని ఇప్పుడు కేవలం రూ.11 వేలకు తగ్గించింది కర్ణాటక ప్రభుత్వం. ఇక పీజీ విద్యార్థులు ఈ స్కీమ్‌ కింద రూ.35 వేల స్కాలర్‌షిప్ అందుకోవాల్సి ఉండగా.. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు వారికి రూ.10 వేలు మాత్రమే అందనున్నాయి. దీంతో కర్ణాటకలోని లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. నిధుల కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కర్ణాటక ప్రభుత్వం చెప్తోంది.

తెలంగాణలోనూ కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. అందుకు కర్ణాటకను ఉదాహరణగా చూపుతోంది బీఆర్ఎస్‌. కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీల కారణంగా అభివృద్ధికి నిధుల్లేకుండా పోయాయని.. ఐదు గ్యారెంటీలను సైతం సరిగ్గా అమలు చేయలేక అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తిసిందని.. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే అంటూ బీఆర్‌ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.

First Published:  13 Nov 2023 3:44 AM GMT
Next Story