Telugu Global
Telangana

అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల పెంపు.. కాంగ్రెస్ ఎన్నికల హామీలు

అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయంతో చేస్తామని.. ఇందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తామని పేర్కొన్నది.

అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ, రిజర్వేషన్ల పెంపు.. కాంగ్రెస్ ఎన్నికల హామీలు
X

రిజర్వేషన్ల తేనె తుట్టను కాంగ్రెస్ పార్టీ మరోసారి కదిలించింది. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో అరచేతిలో వైకుంఠం చూపించేసింది. తెలంగాణలో అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్ల కోటాను పెంచుతామని హామీ ఇచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేయడమే కాకుండా వారికి 18 శాతం రిజర్వేషన్, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పింది. ఈ మేరకు శనివారం చేవెళ్లలో జరిగిన ప్రజాగర్జన సభలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి విడుదల చేశారు.

ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో ముఖ్యమైన 12 అంశాలతో కూడిన పోస్టర్‌ను కూడా నాయకులు విడుదల చేశారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను పెంచడమే కాకుండా ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అంతే కాకుండా అంబేద్కర్ అభయ హస్తం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయంతో చేస్తామని.. ఇందుకు అవసరమైన నిధులను బడ్జెట్‌లో కేటాయిస్తామని పేర్కొన్నది. ప్రభుత్వం చేపట్టే అన్ని కాంట్రాక్టు పనుల్లో ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తామని తెలిపింది.

ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు పొందే కంపెనీల్లో కూడా రిజర్వేషన్లు కల్పిస్తామని పేర్కొన్నది. ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇల్లు లేని ప్రతీ ఎస్సీ, ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.6 లక్షల సాయం చేస్తామని హామీ ఇచ్చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న ఎస్సీ, ఎస్టీల ఎసైన్డ్ భూములన్నీ తిరిగి వారికే అప్పగిస్తామని, అంతే కాకుండా వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తామని తెలిపింది.

ప్రజా ప్రయోజనార్థం భూసేకరణ జరిపితే.. 2013 ప్రకారం సాధారణ పట్టా భూములతో సమానంగా ఎసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామని చెప్పింది. ఇక పోడు భూములు బ్యాంకులో తాకట్టు పెట్టుకునేందుకు, అమ్ముకునేందుకు ఎస్టీలకు పూర్తి హక్కులు ఇస్తామని.. 2006 అటవీ హక్కుల చట్టం కింద పోడు భూములకు పట్టాలు మంజూరు చేస్తామని డిక్లరేషన్‌లో పేర్కొన్నారు.

సమ్మక్క-సారక్క గిరిజన గ్రామీణ అభివృద్ధి పథకం కాంది ప్రతి గూడెం, తండా పంచాయతీలకు రూ. 25 లక్షలు కేటాయించనున్నారు. ఎస్సీల్లో మాదిగ, మాల, ఇతర ఉపకులాల వారికి 3 కార్పొరేషన్లను విడివిడిగా ఏర్పాటు చేయనున్నారు. అంతే కాకుండా ఒక్కో కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.750 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఎస్టీలకు సంబంధించి తుకారాం-ఆదివాసీ, సేవాలాల్ లంబాడా, ఎరుకల వర్గాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. ఒక్కో దానికి రూ.500 కోట్ల నిధులు కేటాయిస్తామన్నారు.

మైదాన ప్రాంతంలోని ఎస్టీల కోసం కొత్తగా నల్గొండ, మహబూబాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో 5 ఐటీడీఏలను ఏర్పాటు చేస్తామని.. పాత వాటితో కలిపి 9 ఐటీడీఏల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యా జ్యోతుల పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పదో తరగతి పాసైతే రూ.10వేలు, ఇంటర్ పాసైతే రూ.15 వేలు, డిగ్రీ పాసైతే రూ.25 వేలు, ఎంఫిల్, పీహెచ్‌డీ చేస్తే రూ.5 లక్షల నగదును అందిస్తామని పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలోని ప్రతీ మండలంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం తిరిగి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పీజీ వరకు విద్యార్థులకు హాస్టల్ సదుపాయం కల్పిస్తామని, విదేశీ విశ్వవిద్యాలయాల్లో సీటు లభించిన ప్రతీ ఎస్సీ, ఎస్టీ విద్యార్థికి ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తమ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో పేర్కొన్నది.


First Published:  27 Aug 2023 6:15 AM IST
Next Story