Telugu Global
Telangana

రాజకీయాల్లోకి వస్తే ఎంపీగా తప్పకుండా గెలుస్తా.. కానీ నా ప్రాధాన్యత ఏ పార్టీ అంటే.. : దిల్ రాజు

తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా దిల్ రాజు బరిలోకి దిగారు. నిర్మాత సి.కల్యాణ్‌తో కలిసి తన ప్యానల్ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టారు.

రాజకీయాల్లోకి వస్తే ఎంపీగా తప్పకుండా గెలుస్తా.. కానీ నా ప్రాధాన్యత ఏ పార్టీ అంటే.. : దిల్ రాజు
X

ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగు పెడితే తప్పకుండా ఎంపీగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన దిల్ రాజు.. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో వ్యాపారం చేస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్‌తో మొదలు పెట్టి విజయవంతమైన నిర్మాతగా, ఎగ్జిబిటర్‌గా కొనసాగుతున్నారు. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ ఏనాడూ తన రాజకీయ ఆకాంక్షలను బయట పెట్టలేదు.

తాజాగా తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) ఎన్నికల్లో అధ్యక్షుడిగా దిల్ రాజు బరిలోకి దిగారు. నిర్మాత సి.కల్యాణ్‌తో కలిసి తన ప్యానల్ సభ్యులతో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ సందర్భంగా రాజకీయాలపై మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వెళ్తే ఏ పార్టీ నుంచి అయినా తప్పకుండా ఎంపీగా గెలుస్తానని చెప్పుకొచ్చారు. తనకు ఈ పార్టీ, ఆ పార్టీ అని లేదని.. అన్నింట్లో స్నేహితులు ఉన్నారని అన్నారు. అయితే తన మొదటి ప్రాధాన్యత మాత్రం సినిమా రంగానికే ఉంటుందని అన్నారు. ఇప్పట్లో సినీ పరిశ్రమను వదిలి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేనది చెప్పారు.

టీఎఫ్‌సీసీ ఎన్నికల బరిలో నిలవడానికి సీనియర్లు ఎవరూ ముందుకు రాకపోవడం వల్లే తాను ఒక ప్యానల్ ఏర్పాటు చేసి నిలబడ్డానని అన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఒక వేళ అధ్యక్షుడిగా గెలిచినా.. కొత్తగా కిరీటాలు ఏవీ పెట్టరని.. పైగా కొత్తగా నెత్తిమీదికి సమస్యలు తెచ్చుకున్నట్లే అని అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం కోసమే తాను ఈ సారి ఎన్నికల్లో నిలబడినట్లు దిల్ రాజు పేర్కొన్నారు. ఫిల్మ్ చాంబర్ ఎన్నికల్లో ఎలాంటి వివదాలు లేవని అన్నారు. సినీ పరిశ్రమలోని నాలుగు సెక్టార్లకు ఫిల్మ్ ఛాంబరే సుప్రీం అని చెప్పారు.

ఫిల్మ్ ఛాంబర్‌లో 1560 మంది నిర్మాతలు సభ్యులుగా ఉన్నా.. రెగ్యులర్‌గా సినిమా తీసే వాళ్లు కేవలం 200 లోపు మాత్రమే అని చెప్పారు. సినీ పరిశ్రమలను బలోపేతం చేసుకోవాలంటే ప్రతీ ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

First Published:  29 July 2023 7:37 PM IST
Next Story