Telugu Global
Telangana

హైదరాబాద్ డెబుల్ డెక్కర్ మెట్రో పూర్తయితే రికార్డే.. ఇండియాలో ఇప్పటికే ఎక్కడ ఉందో తెలుసా?

జేబీఎస్ నుంచి తూంకుంట వరకు రూ.5,690 కోట్లు, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు రూ.4,400 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు.

హైదరాబాద్ డెబుల్ డెక్కర్ మెట్రో పూర్తయితే రికార్డే.. ఇండియాలో ఇప్పటికే ఎక్కడ ఉందో తెలుసా?
X

హైదరాబాద్ మెట్రోను మరో 3 నుంచి 4 ఏళ్లలో భారీగా విస్తరించనున్నారు. ప్రస్తుతం 70 కిలోమీటర్ల మేర ఉన్న మెట్రో లైన్లు.. విస్తరణ తర్వాత 415 కిలోమీటర్లకు పెరుగనున్నవి. హైదరాబాద్ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఈ విస్తరణ చేపట్టడానికి సోమవారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కాగా, ఇందులో అందరికీ ఆసక్తి కిలిగిస్తున్నది డబుల్ డెక్కర్ మెట్రో లైను. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు 17 కిలోమీటర్ల మేర, ప్యారడైజ్ జంక్షన్ నుంచి కండ్లకోయ వరకు 12 కిలోమీటర్ల మేర.. మొత్తం 29 కిలోమీటర్ల పొడవున డబుల్ డెక్కర్ మెట్రో నిర్మించనున్నారు.

జేబీఎస్ నుంచి తూంకుంట వరకు రూ.5,690 కోట్లు, ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు రూ.4,400 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ రెండు రూట్లలో కూడా ప్రస్తుతం ఇరుకైన రోడ్లు, రక్షణ రంగ భూములు ఉన్నాయి. రాజీవ్ రహదారిని విస్తరించాలని ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కానీ కంటోన్మెంట్ ల్యాండ్స్ దీనికి ఇబ్బందికరంగా మారాయి. ఇక హైదరాబాద్-నాగ్‌పూర్ హైవేలో ప్యారడైజ్ నుంచి బోయిన్‌పల్లి ముగిసే వరకు రోడ్డు కూడా ఇరుకుగా ఉంటుంది. ఇక్కడ కూడా ఫ్లైవోవర్ల నిర్మాణానికి రక్షణ రంగ భూములు అడ్డుగా ఉన్నాయి.

ఈ రెండు రూట్లలో సాధారణ ట్రాఫిక్ మళ్లింపు కూడా చాలా కష్టంగా మారింది. ఈ రెండు రహదారుల్లో ఫ్లైవోవర్లు నిర్మించాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఈ క్రమంలో ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. డబుల్ డెక్కర్ మెట్రో లైన్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించింది. దీని వల్ల జేబీఎస్ నుంచి తూంకుంట వరకు, ప్యారడైజ్‌ నుంచి కండ్లకోయ వరకు వాహనాల కోసం ఫ్లైవోవర్‌తో పాటు మెట్రో కూడా నిర్మాణం జరిగిపోతుంది. త్వరలో కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి రంగం సిద్ధమైంది. దీంతో రక్షణ రంగ భూములు కొన్ని తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి వస్తాయి. కాబట్టి డబుల్ డెక్కర్ మెట్రోకు భూసేకరణ కాస్త సులభంగా మారే అవకాశం ఉంటుంది.

డబుల్ డెక్కర్ మెట్రో నిర్మాణం వల్ల.. ఫ్లైవోవర్లు, మెట్రో కోసం వేర్వేరుగా స్థల సేకరణ, నిర్మాణాలు చేయాల్సిన అవసరం ఉండదు. ఒకే పిల్లర్‌పై మొదటిగా ఫ్లైవోవర్ నిర్మించి.. దానిపైన మెట్రోలైన్ ఏర్పాటు చేస్తారు. దీని వల్ల ఓకే సమయంలో రెండు లైన్లు పూర్తయిపోతాయని అధికారులు అంటున్నారు.

నాగ్‌పూర్‌లో 3.14 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ మెట్రో..

దేశంలోనే మొదటి సారిగా నాగ్‌పూర్‌లో డబుల్ డెక్కర్ మెట్రో లైన్ నిర్మించారు. నగరంలోని వార్దా రోడ్డులో 3.14 కిలోమీటర్ల మేర ఈ లైన్ నిర్మాణం జరిగింది. తొలుత నేషనల్ హైవే అథారిటీ ఇక్కడి ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని భారీ ఫ్లైవోవర్ కోసం ప్రణాళిక సిద్ధం చేసింది. ఆదే సమయంలో మహా మెట్రో.. ఇదే లైన్లో మెట్రో నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. దీంతో ఇరు సంస్థలు సమన్వయం చేసుకొని డబుల్ డెక్కర్ మెట్రో లైన్ ఏర్పాటు చేశాయి.

ఈ డబుల్ డెక్కర్ లైన్లో చత్రపతి నగర్, జై ప్రకాశ్ నగర్, ఉజ్వల్ నగర్ మెట్రో స్టేషన్లు కూడా ఉన్నాయి. ఈ మెట్రో లైన్ గిన్నిస్ బుక్కులో చోటు సంపాదించింది. ఇక రాబోయే మూడేళ్లలో హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ లైన్ పూర్తయితే.. 29 కిలోమీటర్ల నిడివితో ప్రపంచ రికార్డు సృష్టించడం ఖాయమే.




First Published:  1 Aug 2023 1:58 PM IST
Next Story