కాంగ్రెస్ లో మునుగోడు చిచ్చు..ఎంపి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మునుగోడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళబోనని కోమటి రెడ్డి వెంకట రెడ్డి తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో మరింత చిచ్చు రగులుస్తోంది. తాను మునుగోడు ప్రచారానికి వెళ్ళేది లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుండబద్దలు కొట్టారు. ఈ వ్యవహారం పార్టీ నాయకుల మధ్య మరింత దూరం పెంచే విధంగా ఉంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిజెపి లో చేరుతుండడంతో ఉప ఎన్నిక అనివార్యమవుతున్నది. ఆయన పార్టీ వీడడంపై టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంలో రేవంత్ సహా మరికొందరు నాయకులు కోమటిరెడ్డి కుటుంబాన్ని ఆన్యాపదేశంగా ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలను ఎంపి వెంకటరెడ్డి తీవ్రంగా పరిగణిస్తున్నారు. తనను అవమానించే రీతిలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్నవారు అంటూ రేవంత్ ను ప్రస్తావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్కం ఠాగూర్ పై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీనన్న కనీస మర్యాద కూడా ఆయన పాటించలేదని విమర్శించారు. ఈ నాయకుల వ్యవహార తీరు తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నట్టు కనబడుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికకు ముందుగానే రేవంత్ రెడ్డి చేతులెత్తేశారని అన్నారు. మొత్తం మీద వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన భవిష్యత్ కార్యాచరణకు సూచనగా కనబడుతున్నాయి. ఆయన సోదరుడు రాజగోపాల రెడ్డి ఈ రోజు కూడా మాట్లాడుతూ తన అన్న వెంకటరెడ్డి తగిన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని మరోసారి చెప్పడం పలు ఊహాగానాలకు దారితీస్తోంది. ఈ నెల 21న ఆయన బిజెపిలో చేరుతున్నానని స్పష్టం చేశారు. దీంతో వెంకటరెడ్డి కూడా పార్టీని వీడతారా అని వినవస్తున్న సందేహాలపై కూడా వెంకటరెడ్డి నేరుగా స్పందించక పోవడం గమనార్హం. గతంలో చెన్నమనేని రాజేశ్వరరావు సిపిఐలోనూ, ఆయన సోదరుడు విద్యాసాగర రావు బిజెపిలో కొనసాగలేదా, అటువంటప్పుడు మేము వేర్వేరు పార్టీలో కొనసాగకూడదా అని ప్రశ్నిస్తున్నారు. ' నా రక్తంలోనే కాంగ్రెస్ రక్తం ఉంది. నేను నాలుగు పార్టీలు మారిన వ్యక్తిని కాదు. వెంకటరెడ్డి అంటే కాంగ్రెస్ .. చచ్చే వరకూ పార్టీలోనే ఉంటాడు.స అన్న వ్యాఖ్యలు ఓ పక్క పార్టీ మారరనిపిస్తున్నా రేవంత్ తదితరులపై చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలు అనుమానాలను తొలగించడంలేదు.
ఈ వ్యాఖ్యలకు అర్ధం ఏమిటి..
చందూరు సభలో కాంగ్రెస్ పెద్దలంతా వేదికపై ఉండగానే తనను దగ్గరుండి అసభ్యపదజాలంతో తిట్టించారని వెంకటరెడ్డి మండిపడ్డారు. కనీసం వారెవరూ తనను విమర్శిస్తున్నవారిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదని ఆయన ఆరోపించారు. 'ఈ పరిణామాలు తనను మానసిక క్షోభకు గురిచేశాయని అన్నారు. ఒక వైపు తమ్ముడు, మరో వైపు పార్టీ ఏం చేయాలో పాలుపోని సందిగ్ధ పరిస్థితుల్లో ఉన్న వాడిని సముదాయించాల్సింది పోయి మరింత బాధ పెడుతున్నారని' అన్నారు. అటువంటి సమయంలో రేవంత్ రెడ్డి కూడా తమను అవమానించే రీతిలో పలు సార్లు మాట్లాడారని, కుటుంబ వ్యాపారాల గురించి ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. మళ్ళీ మాట మార్చి 'నిన్ను కాదు ..నీ తమ్ముడిని' అన్నానని చెబుతున్నారన్నారు. మా కుటుంబ వ్యాపారాలు ఆస్తులతో తనకేమిటి పని.. 'ఎప్పట్నుంచో మేము వ్యాపారాల్లో ఉన్నాం. మరి నీ సంగతేంటి.. నీ ఆస్తుల సంగతేమిటి.. ఏ వ్యాపారాలు చేసి ఆస్తులు కూడబెట్టావో చెప్పగలవా' అని ప్రశ్నించారు.
ప్రచారానికి వెళ్ళను..
అంతేగాక తనను హోంగార్డుతో పోలుస్తున్నారు. ఇది సబబా..అని వెంకటరెడ్డి ప్రశ్నించారు. మూడు దశాబ్దాలుగా పార్టీలో ఉన్న వాళ్లు హోంగార్డుల్లాగా కనబడుతున్నారా.. భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ వీళ్ళంతా హోంగార్డులేనా..అని ప్రశ్నించారు. వాళ్ళంతా ఐపిఎస్ లు కదా వాళ్ళే పార్టీని గెలిపిస్తారు. గెలిపించుకోనీయండి చూద్దాం అని వ్యంగ్యంగా అన్నారు.'మునుగోడు ఎన్నికకు సంబంధించి జరిగే ఏ సమావేశాలకు నన్నుపిలవడం లేదు. ఎందుకు..నేను కాంగ్రెస్ వ్యక్తిని కాదా.. కొందరు తనను కాంగ్రెస్ పార్టీలో నుంచి వెళ్ళగొట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నన్ను వెళ్ళ గొట్టి పార్టీని ఖాళీ చేయాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర ఇన్ ఛార్జి మాణిక్కం ఠాగూర్ పక్కనున్న జానారెడ్డి ఇంటికి వెళ్ళారు. నా ఇంటికి ఎందుకు రాలేదు' అని ఆయన ప్రశ్నించారు. కనీసం పార్టీ పార్లమెంటు సభ్యుడిననే గౌరవం కూడా లేదు. కనీసం ఫోన్ చేసి కూడా మాట్లాడలేదు. నేను పిలవని పేరంటానికి వెళ్ళను. మునుగోడులో ప్రచారానికి వెళ్ళను అని స్పష్ట్ం చేశారు. రేవంత్ రెడ్డి నాకు క్షమాపణలు చెప్పాల్సిందే. తప్పు మాట్లాడానని, బ్రాందీ షాపుల వ్యాఖ్యలపై తప్పు ఒప్పుకుని బహిరంగంగా క్షమాపణలు చెబితే అప్పుడు ఆలోచిస్తా.. అప్పటి వరకూ మునుగోడు ప్రచారానికి వెళ్ళే ప్రస్తక్తేలేదు. ఈ విషయాలన్నీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గరే తేల్చుకుంటా , వారు మాణిక్కం ఠాగూరు, తదితరులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు వెంకటరెడ్డి చెప్పారు. మొత్తం మీద వెంకటరెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు ఏ పరిణామాలకు దారితీస్తాయోనని ఉత్కంఠ నెలకొంది.