Telugu Global
Telangana

చెక్ డ్యాములో నీళ్లు చూసి చాలా సంబురపడ్డాను : సీఎం కేసీఆర్

మన రాష్ట్రం సాగు, తాగు నీటి విషయంలో అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు.

చెక్ డ్యాములో నీళ్లు చూసి చాలా సంబురపడ్డాను : సీఎం కేసీఆర్
X

పాలమూరు జిల్లా అంటే ఒకప్పుడు కరువు కాటకాలకు నెలవుగా ఉండేది. కానీ ఈ రోజు హైదరాబాద్ నుంచి హెలీకాప్టర్‌లో వస్తుంటే నీళ్లు నిండిన చెక్ డ్యాములు చూసి సంబుర పడ్డాను. ఈ కరువు నేలపై నీటిని చూసి ఆనందించానని సీఎం కేసీఆర్ అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయాన్ని మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీఎం మాట్లాడుతూ.. ఒక నాడు నేను, జయశంకర్ సార్ కలిసి తిరుగుతూ.. పాలమూరు కరువు గురించి అనేక సార్లు మాట్లాడుకున్నామని అన్నారు.

సూర్యాపేట నుంచి కల్వకుర్తి వరకు అంతా ఎడారిలా ఉండేది. ఆనాడు ఇక్కడ ఎండిపోయిన వాగులు చూసి, ప్రజల బాధలు చూసి ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఎన్నో ఉద్వేగభరితమైన పాటలు రాశారు. దుందుభి నది ఎలా కొట్టుకొని పోయిందో చెప్పారు. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు వాగులు, వంకలు నీళ్లతో కళకళలాడుతున్నాయన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి. ఇంటింటికీ మంచి నీళ్లు కూడా అందుతున్నాయి. మన రాష్ట్రం సాగు, తాగు నీటి విషయంలో అనేక అవార్డులు, రివార్డులు అందుకున్నదని సీఎం కేసీఆర్ చెప్పారు.

గతంలో వలసలు, కరువులకు నిలయంగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇప్పుడు అద్భుతాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ రోజు నాగర్‌కర్నూల్‌లో కొత్త కలెక్టరేట్ ఓపెన్ చేసుకున్నాము. ఇది 19వ కొత్త కలెక్టరేట్. త్వరలోనే గద్వాల, మంచిర్యాల కలెక్టరేట్లు కూడా ప్రారంభమవుతాయని కేసీఆర్ చెప్పారు. ఈ రోజు తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని సీఎం అన్నారు. ఇండియాలో ఐటీ ఉద్యోగాలకు హైదరాబాద్ హబ్‌గా మారిందన్నారు. దేశంలో రెండు ఐటీ ఉద్యోగాల్లో.. ఒకటి హైదరాబాద్‌లోనే వస్తుందని కేసీఆర్ వివరించారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9 ఏళ్లలో ఒక ఏడు కరోనా వల్ల, ఇంకొక ఏడాది డీమానిటైజేషన్ వల్ల సమయం వృధా అయ్యింది. కానీ మిగిలిన ఏడేళ్లలోనే అద్భుతమైన ప్రగతి సాధించామని కేసీఆర్ అన్నారు. ఇది సీఎంగా నా ఒక్కడి కృషి మాత్రమే కాదని.. కలెక్టర్లు, ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు అందరూ నిరంతరం పని చేయడం వల్లే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని కేసీఆర్ చెప్పారు.

జిల్లాలో కన్నుల పండువగా పంటలు పండుతున్నాయి. ప్రభుత్వం ఏ పిలుపు ఇచ్చినా ఒక యజ్ఞంలో, ఒక ధర్మ కార్యంలా అందరూ పని చేశారని ఉద్యోగులను ఉద్దేశించి చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పథకం కూడా త్వరగా పూర్తి కావాలని.. ధర్మం తప్పకుండా జయిస్తుందని కేసీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

First Published:  6 Jun 2023 6:59 PM IST
Next Story