నా దగ్గర డబ్బుల్లేవు.. ఎన్నికల్లో ఖర్చు పెట్టలేను
తన దగ్గర డబ్బులు లేవంటున్నారు ఈటల రాజేందర్. ఉన్న డబ్బంతా ఉప ఎన్నికల్లో ఖర్చయిపోయిందన్నారు. ఉప ఎన్నికలతో తాను చాలా నష్టపోయానన్నారు.
తన దగ్గర ఇప్పుడు ధన లక్ష్మి లేదని, కేవలం ధైర్య లక్ష్మి మాత్రమే ఉందని అన్నారు ఈటల రాజేందర్. సీఎం కేసీఆర్ తో గజ్వేల్ లో తలపడుతున్న ఆయన తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్ బరిలో కూడా నిలిచారు. ఇటీవల గజ్వేల్ లో ఎక్కువగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించి వచ్చారు ఈటల. తాజాగా హుజూరాబాద్ లో పర్యటిస్తున్న ఆయన.. సొంత నియోజకవర్గ ప్రజలకు తన దీన స్థితి చెప్పుకున్నారు. తన దగ్గర ఇప్పుడు డబ్బుల్లేవని ఈసారి ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నానని చెప్పుకొచ్చారు.
Live : హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం
— Eatala Rajender (@Eatala_Rajender) November 15, 2023
వీణవంక మండలం, బ్రాహ్మణపల్లి గ్రామం ఎన్నికల ప్రచారంలో..https://t.co/E3cEg7FhjV
ఉప ఎన్నికల్లో అయిపోయాయి..
బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటల, బీజేపీలో చేరి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. హుజూరాబాద్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. ఈటలపై సానుభూతి బలంగా పనిచేసింది. వెంటనే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో తన దగ్గర డబ్బులు లేవంటున్నారు ఈటల రాజేందర్. ఉన్న డబ్బంతా ఉప ఎన్నికల్లో ఖర్చయిపోయిందన్నారు. ఉప ఎన్నికలతో తాను చాలా నష్టపోయానన్నారు. హుజూరాబాద్‌లోని వీణవంక మండలంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈటల.
హుజూరాబాద్ తో పాటు, గజ్వేల్ లో కూడా ఈటల రాజేందర్ పోటీ చేస్తుండటంతో.. రెండు చోట్లా ప్రచార కార్యక్రమాలతో ఆయన హడావిడి పడుతున్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పై గెలుస్తారా లేదా అనే విషయం పక్కనపెడితే, కనీస స్థాయిలో ఓట్లు రాకపోతే పరువుపోతుంది. అసలే బీసీ సీఎం అంటూ ఆయన్ను అందరూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ దశలో హుజూరాబాద్ లో గెలవడంతోపాటు, గజ్వేల్ లో గౌరవప్రదమైన స్థాయిలో ఓట్లు తెచ్చుకోవడం ఆయనకు అత్యవసరం. అందుకే రెండు నియోజకవర్గాల్లోను కలియదిరుగుతున్నారు. పనిలో పనిగా తన దగ్గర డబ్బుల్లేవంటూ హుజూరాబాద్ లో సింపతీ కోసం ప్రయత్నిస్తున్నారు. ధన లక్ష్మి, ధైర్య లక్ష్మి అంటూ వేదాంతం మాట్లాడుతున్నారు.