నన్ను చంపేందుకు యత్నించినవారందరినీ క్షమిస్తున్నా.. - ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ
2011 ఏప్రిల్ 30న హైదరాబాద్ లోని బార్కస్ ప్రాంతంలో తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, తనపై దాడికి పాల్పడినవారిని బార్కస్ నేల సాక్షిగా క్షమిస్తున్నానని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు.
తనను చంపాలనే లక్ష్యంతో తనపై దాడికి పాల్పడినవారందరినీ క్షమిస్తున్నానని మజ్లిస్ శాసన సభాపక్ష నేత, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. 'సాలార్-ఎ-మిల్లత్ ఎడ్యుకేషనల్ ట్రస్టు' ఆధ్వర్యంలో బార్కస్ సలాలా ప్రాంతంలో నిర్మించిన ఒవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీ భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా భావోద్వేగ ప్రసంగం చేశారు.
2011 ఏప్రిల్ 30న హైదరాబాద్ లోని బార్కస్ ప్రాంతంలో తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, తనపై దాడికి పాల్పడినవారిని బార్కస్ నేల సాక్షిగా క్షమిస్తున్నానని అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు. తాను రక్తమోడి అచేతన స్థితిలో పడిపోయిన సమయంలో వెన్నుచూపి పారిపోయిన వారినీ క్షమిస్తున్నానని తెలిపారు. తన బాటలో ముళ్లు పరుస్తున్న వారిని, తన గళాన్ని అణగదొక్కినవారిని, వెన్నుపోటు పొడిచినవారిని, కుట్రలు చేసిన వారిని క్షమిస్తున్నానని ప్రకటించారు.
అయితే.. వారంతా తన ఎదుట పడవద్దని ఒవైసీ చెప్పారు. దాడి సమయంలో తనను రక్షించిన ఎమ్మెల్యే అహ్మద్ బలాలాతో పాటు మన్సూర్ అవర్గీ, మహమూద్ అవర్గీ, మొహిసిన్ కసేరి తదితరులకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పారు. తన కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడని, ఎన్నికల్లో పోటీ చేస్తాడని వస్తున్న ఊహాగానాలను ఈ సందర్భంగా ఆయన తోసిపుచ్చారు.