Telugu Global
Telangana

కేటీఆర్‌ ప్రోద్బలంతో దాడి జరిగిందని నేను చెప్పలేదు

పోలీసులు నా పేరుతో తప్పుడు కన్ఫెషన్‌ రిపోర్ట్‌ ఇచ్చారు.. : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి

కేటీఆర్‌ ప్రోద్బలంతో దాడి జరిగిందని నేను చెప్పలేదు
X

కేటీఆర్‌ ప్రోద్బలంతోనే లగచర్లలో అధికారులపై రైతులు దాడి చేశారని తాను ఎక్కడా పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇవ్వలేదని కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డి స్పష్టం చేశారు. ఈమేరకు కొడంగల్‌ జ్యూడిషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో గురువారం తన అడ్వొకేట్ల ద్వారా అఫిడవిట్‌ ఫైల్‌ చేశారు. తనను కోర్టుకు తీసుకువచ్చిన తర్వాత తమ అడ్వొకేట్‌ అడిగితే పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌ ఇచ్చారని తెలిపారు. అప్పటి వరకు అందులో ఏముందో కూడా తనకు తెలియదన్నారు. పోలీసులు నా పేరుతో తప్పుడు కన్ఫెషన్‌ రిపోర్ట్‌ ఇచ్చారని అప్పుడే తెలిసిందన్నారు. తాను చెప్పని విషయాన్ని తన స్టేట్‌మెంట్‌గా తప్పుగా నమోదు చేశారని, దానిని పరిగణలోకి తీసుకోవద్దని న్యాయమూర్తిని కోరారు. కొడంగల్‌ నియోజకవర్గంలో ఫార్మా పరిశ్రమ స్థాపన కోసం భూ సేకరణకు వెళ్లిన వికారాబాద్‌ కలెక్టర్‌ సహా పలువురు అధికారులపై రైతులు తిరగబడ్డారు. వారి వాహనాలపై రాళ్లు విసిరారు. ఈ ఘటనకు బాధ్యుడిగా పేర్కొంటూ పోలీసులు బుధవారం ఉదయం కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ రెడ్డిని హైదరాబాద్‌ లో అరెస్ట్‌ చేశారు. కేటీఆర్‌ ప్రోద్బలంతోనే రైతులు దాడి చేశారని ఆయన చెప్పినట్టుగా పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. ఆ రిమాండ్‌ రిపోర్టును పట్నం నరేందర్‌ రెడ్డి సవాల్‌ చేయడంతో ఇప్పుడు ఈ కేసు ఆసక్తికరంగా మారింది.



First Published:  14 Nov 2024 6:33 PM IST
Next Story