Telugu Global
Telangana

కార్యకర్తలంతా కష్టపడితేనే నాకు సీఎం పదవి

నాకంటూ ప్రత్యేకంగా గుర్తింపేమి లేదు.. కాంగ్రెస్‌ పార్టీనే ఈ గుర్తింపు ఇచ్చింది : సీఎం రేవంత్‌ రెడ్డి

కార్యకర్తలంతా కష్టపడితేనే నాకు సీఎం పదవి
X

కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలంతా కష్టపడి పని చేస్తేనే తనకు సీఎం పదవి వచ్చిందని, తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపేమి లేదని కాంగ్రెస్‌ పార్టీనే ఈ గుర్తింపు ఇచ్చిందని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇక్కడ ఉన్నది రేవంత్‌ రెడ్డినా.. మహేశ్‌ కుమార్‌ గౌడా అన్నది కాదు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గేకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రధానమన్నారు. కుల గణనపై బుధవారం గాంధీ భవన్‌ లో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు. గాంధీ కుటుంబం మాట ఇస్తే హరిహరాదులు అడ్డం వచ్చినా నెరవేర్చి తీరుతారనే నమ్మకం మనం కల్పించాలన్నారు. కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిరుడు సెప్టెంబర్ 17న తుక్కుగూడ సభలో సోనియాగాంధీ ఆరు గ్యారంటీలు ప్రకటించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియమ్మ ఇచ్చిన మాట మనం నెరవేర్చి తీరాలన్నారు. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట నెరవేర్చని వారు పార్టీ ద్రోహులవుతారని అన్నారు. తనకంటూ ప్రత్యేకంగా ఎజెండా ఏమీ లేదని, పార్టీ ఎజెండాతోనే ముందుకెళ్తామన్నారు.

బీసీ గణన చేస్తామన్న మాటకు కట్టుబడి కాంగ్రెస్‌ ఐడియాలజీ ఉన్న నిరంజన్‌ ను బీసీ కమిషన్‌ చైర్మన్‌ గా నియమించామన్నారు. బీసీ గణనలో ప్రతి కార్యకర్త పాలు పంచుకోవాలన్నారు. కుల గణనను సమన్వయం చేయడానికి 33 జిల్లాలకు అబ్జర్వర్లను నియమించాలని సూచించారు. దేశానికి మోడల్‌ గా ఈ సర్వే నిలువాలన్నారు. రాహుల్‌ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. నవంబర్‌ 31 నాటికి కులగణన పూర్తి చేసి భవిష్యత్‌ యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ నుంచే నరేంద్రమోదీపై యుద్ధం ప్రకటించాలన్నారు. కుల గణన ఎక్స్‌ రే మాత్రమే కాదు.. మెగా హెల్త్‌ చెకప్‌ లాంటిదని అన్నారు. సామాజిక న్యాయం ప్రకారం ఆదాయం పంచడమే కాంగ్రెస్‌ విధానమని, దానికి ఈ కులగణన దోహద పడుతుందన్నారు.

ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా డీఎస్సీ నియామకాలు పూర్తి చేశామన్నారు. కొందరు తమ రాజకీయ మనుగడ కోసం అడ్డంకులు సృష్టించినా పది నెలల్లో 50 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. గ్రూప్‌ -1 విషయంలోనూ ప్రతిపక్షాలు రకరకాల అపోహలు సృష్టించి అడ్డుకోవాలని చూశాయన్నారు. జీవో ఇచ్చినప్పుడు, నోటిఫికేషన్‌ ఇచ్చినప్పుడు, ప్రిలిమ్స్ ఫలితాలు ఇచ్చినప్పుడు కోర్టుకు పోనోళ్లు మెయిన్స్‌ కు ముందుకు జీవో 29పై కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నాలు చేశారన్నారు. సుప్రీం కోర్టు వారి పిటిషన్‌ కొట్టేసిందన్నారు. గ్రూప్‌ -1 మెయిన్స్‌ కు సెలక్ట్‌ అయిన 31,383 మందిలో 10శాతం లోపు మాత్రమే అగ్రవర్ణాలు ఉన్నారుని తెలిపారు. 57.11 శాతం బీసీలు,15.38 శాతం ఎస్సీలు, 8.87 శాతం ఎస్టీలు, 8.84 ఈడబ్ల్యూఎస్ కోటాలో సెలక్ట్ అయ్యారని, స్పోర్ట్స్ కోటాలో 20 మంది సెలక్ట్ అయ్యారని తెలిపారు. రేవంత్‌ రెడ్డి చట్టాన్ని అమలు చేస్తాడు తప్ప వ్యక్తిగత ఎజెండాతో పని చేయడన్నారు. పార్టీకి నష్టం చేసేలా ఎవరైనా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రతిపక్షాల కుట్రలను ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

First Published:  30 Oct 2024 4:12 PM IST
Next Story