ఎమ్మెల్యేలందరిలో నేనే సీనియర్ : చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
ఏపీలో కొత్తగా ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి తన రాజకీయ జీవితంలోని అనుభవాలను ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. రాజకీయల్లో విలువలకు కట్టుబడి ఉండడం, ప్రజా ఉపయోగ రాజకీయాలు చేయడం వంటి అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు రాష్ట్ర సంపదగా తయారు కావాలని అభిలషించారు. ప్రజా సమస్యల వేదికగా అసెంబ్లీని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. "తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలందరిలో నేనే సీనియర్. ప్రతి రోజూ కొత్త విషయాలు నేర్చుకుంటాను. అసెంబ్లీ సమావేశాలను ప్రతి ఎమ్మెల్యే సీరియస్ గా తీసుకోవాలి" అని పిలుపునిచ్చారు. ఇక, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... ప్రశ్నోత్తరాలు, జీరో అవర్, స్వల్పకాలిక చర్చలు తదితర అంశాలపై ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించారు.
స్థానిక సమస్యల పరిష్కారానికి ప్రశ్నోత్తరాల్లో అవకాశం రాకపోతే... లఘు చర్చలు, జీరో అవర్ లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నించడం ద్వారా నియోజకవర్గ సమస్యలకు పరిష్కారం చూపొచ్చని అన్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీ నియమనిబంధనలు తెలుసుకోవాలని అయ్యన్న స్పష్టం చేశారు.. బడ్జెట్ పై అవగాహన, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా.. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం బుధవారానికి సభను వాయిదా వేశారు. ఇందులో భాగంగా నేడు సీఎం చంద్రబాబు నూతనంగా ఎన్నికైన కూటమి ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు.