టీఆరెస్ నేత కృష్ణయ్య హత్యతో నాకు సంబంధం లేదు.. తమ్మినేని వీరభద్రం
టీఆరెస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య హత్యలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం హస్తం ఉందంటూ కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆ ఆరోపణలు ఖండించారు వీరభద్రం. అవసరమైతే పోలీసు విచారణకు తాను సిద్దమంటూ ఆయన స్పష్టం చేశారు.
టీఆరెస్ నేత కృష్ణయ్య హత్యకు, తనకు సంబంధం లేదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం చెప్పారు. తను పోలీసులకు అందుబాటులో లేననడం అవాస్తవమని, అవసరమైతే పోలీసుల విచారణకు తాను సిద్ధమని ఆయన ప్రకటించారు. ఈ కేసుకు సంబంధించి నిందితుల జాబితాలో మా సోదరుల పేర్లు గానీ, తమ పార్టీ కార్యకర్తల పేర్లు గానీ లేవన్నారు. నా ఫోన్ స్విచాఫ్ వచ్చిందనడం కూడా నిజం కాదన్నారు. ఈ కేసు విచారణలో ఉందని, అన్ని విషయాలు వెల్లడవుతాయని చెప్పారు. నిన్న పార్టీ ఆఫీసులో జాతీయ జెండా కూడా ఎగరవేశామన్నారు. ఈ హత్యా రాజకీయాలతో సంబంధం లేదని తమ పార్టీ జిల్లా కార్యదర్శి ఇప్పటికే ప్రకటించారని చెప్పిన ఆయన.. హత్య జరిగిన సమయంలో తన భార్య ఖమ్మంలోనే ఉందని, ఆమెకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరానని తెలిపారు. కృష్ణయ్య కుటుంబ సభ్యులు ఆవేశంలో మాట్లాడారని ఆయన అన్నారు.
మరో వైపు సంచలనంగా మారిన ఈ కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నాలుగు ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు. కృష్ణయ్యను హత్య చేసిన అనంతరంఆరుగురు నిందితులు మహబూబాద్ లోని సీపీఎం పార్టీ అఫీసుకు వెళ్లి షెల్టర్ కోరారని, ఆ తరువాత అక్కడి నుంచి రాజమండ్రి వెళ్లారని తెలుస్తోంది. కృష్ణయ్య హత్య నేపథ్యంలో ఖమ్మం జిల్లా అంతటా పోలీసు బలగాలను మోహరించారు. తెల్లారపల్లిలో 144 సెక్షన్ అమల్లో ఉంది.
అయితే తన భర్త హత్యలో తమ్మినేని వీరభద్రం సోదరుడు కోటేశ్వర రావు హస్తం ఉందని కృష్ణయ్య భార్య మంగతాయమ్మ ఆరోపించగా.. తన తండ్రి మర్డర్ లో వీరభద్రం సహా కోటేశ్వర రావు హస్తం కూడా ఉందని ఆయన కుమార్తె ఆరోపించారు. రాజకీయంగా కృష్ణయ్య ఎదుగుల చూసి సహించలేక ఈ దారుణానికి పాల్పడ్డారని వారు వాపోయారు.