ఈడీ నోటీసులను పట్టించుకోనవసరం లేదు.. నేను విచారణకు వెళ్లడం లేదు : ఎమ్మెల్సీ కవిత
ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని కవిత అన్నారు.
ఢిల్లీ లిక్కర్ టెండర్ల కేసులో ఎమ్మెల్సీ కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు పంపించింది. ఈ నెల 15న ఢిల్లీలోని కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. కాగా, ఎమ్మెల్సీ కవిత ఈడీ నోటీసులపై స్పందించారు. తనకు ఈడీ నోటీసులు అందాయని.. అయితే వీటిని పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదని చెప్పారు. తాను రేపు ఈడీ విచారణకు వెళ్లబోవడం లేదని.. నోటీసును పార్టీ లీగల్ టీమ్‌కు ఇచ్చాను. వారే అంతా చూసుకుంటారని తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ టెండర్ల కేసులో ఏడాది కాలంగా ఈడీ విచారణ కొనసాగుతూనే ఉన్నది. దీన్ని ఒక టీవీ సీరియస్‌లాగా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి మరో ఎపిసోడ్‌ను ఈడీ అధికారులు రిలీజ్ చేయబోతున్నారని కవిత అన్నారు. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు అని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ఈ విచారణ ఇంకా ఎంత కాలం కొనసాగుతుందో తెలియదని.. అయితే ప్రజలే బీజేపీకి గుణపాఠం చెబుతారని కవిత అన్నారు. ఈడీ నోటీసులను పార్టీ శ్రేణులు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఈడీ పలు మార్లు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు జారీ చేసింది. గతంలో కూడా కొన్ని గంటల పాటు కవితను ఢిల్లీలో విచారించారు. ఆ సమయంలో కవిత ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పరీక్షించడానికి పంపారు. కానీ ఇంత వరకు ఈడీ మాత్రం ఫోన్లలో ఏం బయటపడిందనేది చెప్పలేదు. ఇప్పటికే ఈ కేసులో విచారణ పూర్తయ్యిందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా మరోసారి కవితకు నోటీసులు అందటం కీలకంగా మారింది.