Telugu Global
Telangana

కూల్చివేతలపై హైడ్రా రిపోర్టు.. లిస్టులో ప్రముఖులు

లోటస్‌పాండ్‌, మన్సూరాబాద్ సహరా ఎస్టేట్‌లో పలు నిర్మాణాలు, బీజేఆర్‌నగర్, బంజారాహిల్స్, గాజులరామారం, అమీర్‌పేట, బోడుప్పల్, గండిపేట చెరువులో పలు నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు నివేదికలో తెలిపింది.

కూల్చివేతలపై హైడ్రా రిపోర్టు.. లిస్టులో ప్రముఖులు
X

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆక్రమణలపై కొద్ది రోజులుగా హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఎక్కడ కూల్చివేతలు ఉంటాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఆక్రమణ జరిగిందని తెలిస్తే చాలు.. ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేతలు చేపడుతోంది హైడ్రా. శనివారం హీరో నాగార్జునకు చెందిన N-కన్వెన్షన్ సెంటర్ కూల్చివేయడం సంచలనంగా మారింది.


ఇప్పటివరకూ జరిపిన కూల్చివేతలపై ప్రభుత్వానికి రిపోర్టు సమర్పించింది హైడ్రా. గ్రేటర్ పరిధిలో ఇప్ప‌టి వ‌ర‌కు 18 చోట్ల కూల్చివేతలు జరిపినట్లు స్పష్టం చేసింది. ఈ జాబితాలో పలువురు ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ లిస్టులో హీరో అక్కినేని నాగార్జునతో పాటు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు, బీజేపీ నేత సునీల్ రెడ్డి, బీఆర్ఎస్ లీడర్ రత్నాకర్ రాజు, కావేరి సీడ్స్ అధినేత భాస్కర్‌ రావు, ప్రో కబడ్డీ ఓనర్ అనుపమ, MIM ఎమ్మెల్యే మోబిన్, MIM ఎమ్మెల్సీ మీర్జా బేగ్ కట్టడాలు కూల్చివేసినట్లు స్పష్టం చేసింది.

దీంతో పాటు లోటస్‌పాండ్‌, మన్సూరాబాద్ సహరా ఎస్టేట్‌లో పలు నిర్మాణాలు, బీజేఆర్‌నగర్, బంజారాహిల్స్, గాజులరామారం, అమీర్‌పేట, బోడుప్పల్, గండిపేట చెరువులో పలు నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు నివేదికలో తెలిపింది. నందినగర్‌లో ఎకరం స్థలంతో పాటు, మిథాలి నగర్‌లో పార్క్‌ స్థలాన్ని కాపాడినట్లు తెలిపింది. మొత్తంగా ఇప్పటి వరకు 43 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు రిపోర్టులో అధికారులు స్పష్టం చేశారు.

First Published:  25 Aug 2024 1:01 PM GMT
Next Story