Telugu Global
Telangana

హైడ్రాకు ఇక స్పెషల్‌ పవర్స్‌

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం

హైడ్రాకు ఇక స్పెషల్‌ పవర్స్‌
X

హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ (హైడ్రా)కు విస్తృతాధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆమోదం తెలిపారు. గవర్నర్‌ ఆమోదముద్ర వేయడంతో ఇకపై హైడ్రా చేపట్టే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు సమాచారం. అప్పటిదాకా హైడ్రాకు ఈ ఆర్డినెన్స్‌ రక్షణగా ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్‌ పలు సందేహాలు వ్యక్తం చేశారు. వీటిని పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌ నివృత్తి చేశారు. దీంతో ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ ఆమోదం తెలిపారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించడం సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలోనూ రక్షణ చర్యలు, భారీ వర్షాలు పడినప్పుడు ట్రాఫిక్‌ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక శాఖ సేవలకు ఎన్‌ఓసీ జారీ తదితర లక్ష్యాలతో జులై 19న 99జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఓఆర్‌ఆర్‌ వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ఈ ఆర్డినెన్స్‌తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు వచ్చాయి. ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇటీవలే పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే.

ఆర్డినెన్స్‌తో హైడ్రాకు కీలక అధికారాలు

ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణ తొలిగింపు అధికారం కల్పించే జీహెచ్‌ఎంసీ చట్టం-1955 లోని సెక్షన్‌ 374బీని ఆర్డినెన్స్‌లో చేర్చారు. అనధికార ప్రకటనలకు జరిమానాలు విధించే అధికారం హైడ్రాకు బదిలీ అయ్యింది. పురపాలక చట్టం-2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్‌, మున్సిపాలిటీ కమిషర్‌కు ఉన్న అధికారాలు, బీపాస్‌ చట్టం-2020 ప్రకారం జోనల్‌ కమిషనర్‌ నేతృత్వంలోని జోనల్‌ టాస్క్‌ఫోర్స్‌ కలెక్టర్‌ నేతృత్వంలోని జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు ఉన్న అధికారాలను హైడ్రాకు ఇచ్చారు. అలాగే హెచ్‌ఎండీఏ చట్టం-2008 లోని పలు సెక్షన్ల కింద కమిషనర్‌కు ఉన్న అధికారం, భూ ఆదాయ చట్టంలోని సెక్షన్‌ 1317 ఎఫ్‌ ప్రకారం ఆక్రమణల తొలిగింపు, ఆస్తుల పరిరక్షణకు ఆర్డీవో, కలెక్టర్‌కు ఉన్న అధికారాలు, అవే అంశాలకు సంబంధించి నీటిపారుదల చట్టంలోని అధికారాలు, జీవో 67 ద్వారా 2002లో యూడీఏ /ఎగ్జిక్యూటివ్‌ అధికారికి ఇచ్చిన అధికారాలను హైడ్రాకు కట్టబెట్టారు. వీటితో పాటు భూ ఆక్రమణ చట్టం-1905లోని పలు సెక్షన్ల కింద జిల్లా కలెక్టర్‌, తహసీల్దార్‌, డీటీకి ఉన్న అధికారాలు, వాల్టా చట్టం-2002, తెలంగాణ బిల్డింగ్‌ రూల్స్‌, ఫైర్‌ సర్వీసెస్‌ చట్టంలోని పలు అధికారాలు హైడ్రాకు వర్తింపజేశారు. నిర్మాణాలపై చర్యలు తీసుకోవడంలో జాప్యానికి తావులేకుండా హైడ్రా కొత్త అధికారాలతో చర్యలను సకాలంలో తీసుకోగలుగుతుంది.

First Published:  2 Oct 2024 10:03 AM IST
Next Story