Telugu Global
Telangana

కాలేజీలు పడగొట్టే విషయంలో హైడ్రా క్లారిటీ

హైడ్రా చర్యలు వేగవంతమవుతున్న తరుణంలో, రాజకీయ ఆరోపణలు కూడా బలంగా వినపడుతున్నాయి.

కాలేజీలు పడగొట్టే విషయంలో హైడ్రా క్లారిటీ
X

ఒవైసీ విద్యాసంస్థలు, మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలు.. వీటిల్లో ఏ ఒక్కదాన్నీ వదిలిపెట్టబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేశారు. అయితే విద్యాసంస్థలను కూల్చివేసే విషయంలో హైడ్రా మానవతా దృక్పథంతో ఆలోచిస్తుందని అన్నారాయన. ఫుల్ ట్యాంక్ లెవల్(FTL) అనేది ముఖ్యమే కానీ.. దానికంటే విద్యార్థుల భవిష్యత్తు మరీ ముఖ్యం అని చెప్పారు. ఒవైసీ, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల కాలేజీలకు సమయం ఇచ్చి తొలగింపు చర్యలు చేపడతామని క్లారిటీ ఇచ్చారు రంగనాథ్. చెరువులను ఆక్రమించి కాలేజీలు కట్టడం వారి పొరపాటు అయి ఉండొచ్చుకానీ.. దానికోసం విద్యార్థుల భవిష్యత్తుని బలిచేయబోమని అన్నారు.

రాజకీయాలకు అతీతంగా తాము పనిచేస్తున్నట్టు చెప్పుకొచ్చారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మీడియాకు విస్తృతంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న ఆయన, రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదని చెప్పారు. ధర్మసత్రమైనా FTL పరిధిలో ఉంటే కూల్చేస్తామని అన్నారు. హైడ్రా నోటీసులు ఇవ్వదని, కూల్చివేతే తమ పని అని స్పష్టం చేశారు. మరోవైపు హైడ్రాకు వచ్చే ఫిర్యాదుల సంఖ్య భారీగా పెరిగింది. సోషల్ మీడియాలో కూడా హైడ్రాని ట్యాగ్ చేస్తూ ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్‌ను కలిసి కొన్ని ఆక్రమణలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ స్థలాలు కాపాడాలని, సహజవనరులను రక్షించాలని చెప్పారు.

హైడ్రా చర్యలు వేగవంతమవుతున్న తరుణంలో, రాజకీయ ఆరోపణలు కూడా బలంగా వినపడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వం మాత్రం హైడ్రా విషయంలో తగ్గేదే లేదంటోంది. అదనంగా హైడ్రా కార్యాలయానికి సెక్యూరిటీ కూడా పెంచింది. హైడ్రా కార్యాలయానికి వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య కూడా పెరిగింది. వారందరి వద్ద వివరాలు సేకరించి వాటిని నమోదు చేసుకుంటున్నారు హైడ్రా సిబ్బంది.

First Published:  27 Aug 2024 3:23 PM GMT
Next Story