జూబ్లీ హిల్స్ లో 89.92 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసులు 89.92 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. ఓ కారులో ఆ సొమ్మును తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
మునుగోడు ఉపఎన్నికల నేపథంలో అనేక చోట్ల డబ్బు పట్టుబడుతోంది. హైదరాబాద్ నగరంలో 18 రోజుల్లో 26 కోట్ల మేర నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రోజు జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో రూ.89.92 లక్షల నగదు పట్టుబడింది.
ఓ కారులో డబ్బు తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 71లో వాహనాలను చెకింగ్ చేస్తుండగా ఓ కారులో రూ.89.92 లక్షల నగదును గుర్తించారు. సంబందిత వ్యక్తులు ఆ డబ్బును ఎక్కడికి తీసుకెళ్తున్నారు?. ఎక్కడి నుంచి తెస్తున్నారు ? ఆ నగదుకు సంబంధించిన పత్రాలు..తదితర సమాచారం ఇవ్వకపోవడంతో పోలీసులు ఆ నగదును స్వాధీనం చేసుకొని ఆ డబ్బు తీసుకెళ్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకొని జూబ్లీ హిల్స్ పోలీసు స్టేషన్ తీసుకెళ్ళారు.
గత కొన్ని రోజులుగా హైదరాబాద్ , పంజా గుట్టలో 70 లక్షల రూపాయలు, బేగంబజార్ లో 48.50 లక్షల రూపాయలు, నగర శివార్లలో 45 లక్షల రూపాయలు పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. మునుగోడు ఎన్నికల నోటి ఫికేషన్ వచ్చాక ఇప్పటి వరకు 26 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.