Telugu Global
Telangana

ప్రాణం తీసిన ట్రాఫిక్ చలాన్.. అసలు కథ వేరే ఉంది

పాత చలాన్లు ఉన్న విషయం నిజమేనని, అయితే ఎల్లయ్య డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన తర్వాతే వాహనం సీజ్ చేశామని అంటున్నారు పోలీసులు.

ప్రాణం తీసిన ట్రాఫిక్ చలాన్.. అసలు కథ వేరే ఉంది
X

హైదరాబాద్ లో ట్రాఫిక్ చలాన్లు కట్టలేక, పోలీసులు తన బైక్ సీజ్ చేశారన్న బాధతో ఎల్లయ్య అనే కూలీ ఆత్మహత్యకు పాల్పడ్డాడనే వార్త ఇటీవల కలకలం రేపింది. ఎల్లయ్య సూసైడ్ నోట్ తో ఈ వ్యవహారం మరింత రచ్చకెక్కింది. ట్రాఫిక్ పోలీసుల్ని అందరూ తప్పుబట్టారు. ఇదే అదనుగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని చూసింది బీజేపీ. ట్రాఫిక్ చలాన్ల పేరుతో పేద ప్రజల ప్రాణాలు తీస్తున్నారంటూ బండి సంజయ్ హడావిడి చేశారు.

ఏది నిజం..? ఎంత నిజం..??

అన్యాయంగా చలాన్లు రాశారని, పెండింగ్ చలాన్లు అంతా కలిపి 10వేల రూపాయలు జరిమానా కట్టకపోతే బైక్ తిరిగి ఇవ్వనన్నారని ఎల్లయ్య సూసైడ్ నోట్ లో రాసినట్టు ఉంది. అయితే అసలు కథ వేరే ఉందని అంటున్నారు పోలీసులు. బైక్ సీజ్ చేసిన సందర్భంలో కూడా సదరు ఎల్లయ్య డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డాడని వివరించారు. పాత చలాన్లు ఉన్న విషయం నిజమేనని, అయితే ఎల్లయ్య డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన తర్వాతే వాహనం సీజ్ చేశామని అంటున్నారు.

ఇది మూడోసారి..

ఎల్లయ్య డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడటం ఇదే తొలిసారి కాదు. మూడోసారి. ఇప్పటికే రెండుసార్లు అతడికి చలాన్ విధించి వార్నింగ్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. మూడోసారి కూడా డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడటంతో బండి స్వాధీనం చేసుకున్నారు. దీంతో అతను సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ లెటర్ లో తన తప్పేమీ లేదని, పోలీసులు కావాలనే తన బండి సీజ్ చేశారని, అప్పుచేసి బండి కొన్న తాను, చలాన్లు కట్టలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నాడు. డ్రంకెన్ డ్రైవ్ సంగతి మాత్రం దాచిపెట్టాడు.

అలా వదిలేయాలా..?

పోలీసుల వివరణ బయటకొచ్చిన తర్వాత ఈ ఘటనపై నెటిజన్లు మరో రకంగా రియాక్ట్ అవుతున్నారు. డ్రంకెన్ డ్రైవ్ లో ఇప్పటికైనా వాహనం సీజ్ చేసి మంచి పని చేశారని, లేకపోతే యాక్సిడెంట్లు చేసి ఎల్లయ్య ఎంతమంది ప్రాణాలు తీసేవాడోనని అంటున్నారు. ట్రాఫిక్ చలాన్లు ప్రాణం తీస్తున్నాయంటూ కథనాలు వండి వార్చిన అత్యుత్సాహపు మీడియాని కూడా నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఎల్లయ్య తాగి బండి నడుపుతూ ప్రమాదాలు చేస్తే అప్పుడు మీడియా ఏం చేసేదని, ప్రశ్నిస్తున్నారు. డ్రంకెన్ డ్రైవ్ విషయంలో పోలీసులు కఠినంగానే ఉండాలంటున్నారు.

First Published:  9 March 2023 11:06 AM IST
Next Story