Telugu Global
Telangana

ఉద్యోగాలివ్వడంలో గ్రేట్.. వరల్డ్ టాప్-10 సిటీస్ లో హైదరాబాద్

బెస్ట్‌ లివింగ్‌ సిటీగా ఇప్పటికే ప్రపంచ సర్వేల్లో చోటు సంపాదించిన హైదరాబాద్, ఇప్పుడు ఐటీ ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డ్ సాధించడం విశేషం. 2014నుంచి నియామకాల్లో భారీగా పురోగతి కనపడుతోంది.

ఉద్యోగాలివ్వడంలో గ్రేట్.. వరల్డ్ టాప్-10 సిటీస్ లో హైదరాబాద్
X

దేశవ్యాప్తంగా ఐటీ నియామకాల్లో హైదరాబాద్ ఇప్పటికే టాప్ ప్లేస్ సాధించింది. బెంగళూరు, ముంబై, చెన్నైలను వెనక్కు నెట్టి ఐటీ రంగంలో భారీగా ఉపాధి అవకాశాలను చూపిస్తోంది. ఇప్పుడీ ఖ్యాతి ప్రపంచవ్యాప్తం అయింది. అవును, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఐటీ ఉద్యోగాలిస్తున్న నగరాల్లో టాప్-10 లిస్ట్ లో హైదరాబాద్ చోటు సంపాదించింది. ప్రస్తుతం పదో స్థానంలో ఉంది హైదరాబాద్.

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ ఉద్యోగాల కల్పనలో సింగపూర్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత టోక్యో, వాంకోవర్, టొరంటో.. వరుసగా నిలిచాయి. ఈ లిస్ట్ లో ఇప్పుడు హైదరాబాద్ కూడా చేరడం విశేషం. సీటెల్‌-వాషింగ్టన్‌ ప్రధాన కార్యాలయాలుగా పని చేసే ప్రముఖ టెక్నికల్‌ ఇంటర్వ్యూ సంస్థ కారత్‌ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని ధృవీకరించింది. టెకీల నియామకంలో హైదరాబాద్‌ దేశంలోని అన్ని నగరాల కంటే ముందుండటం ఒకెత్తు, ఇప్పుడు ప్రపంచంలోని టాప్‌-10 నగరాల్లో పదో స్థానాన్ని కైవసం చేసుకోవడం మరో అరుదైన రికార్డు. టాలెంట్ ఉన్న ఐటీ ఉద్యోగులకోసం అంతర్జాతీయ కంపెనీలు కూడా హైదరాబాద్‌ వైపే చూస్తున్నాయని ఆ నివేదిక వెల్లడించింది. టాప్-10 లిస్ట్ తర్వాత, చెన్నై, గుర్ గావ్, బెంగళూరు, పుణె టాప్-20 లిస్ట్ లో చోటు సంపాదించాయి.

బెస్ట్‌ లివింగ్‌ సిటీగా ఇప్పటికే ప్రపంచ సర్వేల్లో చోటు సంపాదించిన హైదరాబాద్, ఇప్పుడు ఐటీ ఉద్యోగాల కల్పనలో కూడా రికార్డ్ సాధించడం విశేషం. 2014నుంచి నియామకాల్లో భారీగా పురోగతి కనపడుతోంది. 2014-15లో 3,71,774 నియామకాలు ఐటీ రంగంలో జరిగాయి. 2021-22లో 7,78,121 నియామకాలు జరిగాయి. అంటే ఉపాధి కల్పనలో హైదరాబాద్ ఎనిమిదేళ్లలోనే రెట్టింపుకంటే ఎక్కువ పురోగతి సాధించింది. ఈ ర్యాంకుల ఆధారంగానే ప్రపంచ స్థాయి కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయి. వాటి ద్వారా ఉద్యోగ అవకాశాలు మరింతగా పెరుగుతున్నాయి. ఐటీకి సంబంధించిన కోచింగ్‌ సంస్థలతోపాటు ప్రముఖ విద్యా సంస్థలు ఐటీ కోర్సుల్లో మెరుగైన శిక్షణనిస్తుండటంతో క్యాంపస్‌ ఇంటర్వ్యూల ద్వారానే ఐటీ కంపెనీలు ఉద్యోగులను నియమించుకొంటున్నాయి. దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి యువత ఐటీ కోర్సులు నేర్చుకోడానికి హైదరాబాద్‌ కి వస్తోంది. శిక్షణ తర్వాత ఉద్యోగాలు సైతం నగరంలోని ఐటీ కంపెనీల్లో పొందుతున్నారు.

First Published:  2 March 2023 9:05 AM IST
Next Story