హైదరాబాద్ టు విజయవాడ.. ఆగిన రాకపోకలు
ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వాగు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి.
తెలంగాణ చరిత్రలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరంగల్ వంటి నగరాలే జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇటు ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరునుంచి భారీ వర్షాలు కురుస్తున్నా.. తెలంగాణతో పోల్చి చూస్తే ఆ ఉధృతి తక్కువే అని చెప్పాలి. అయితే తెలంగాణ నుంచి వచ్చే వాగులు.. ఏపీలోనూ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారి(NH-65) పైకి వరద నీరు చేరింది. ఎన్టీఆర్ జిల్లాలోని ఐతవరం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై మున్నేరు వాగు వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఏపీ, తెలంగాణ మధ్య రాకపోకలు స్తంభించాయి. అటు కీసర వంతెన వద్ద కూడా వరద ప్రవాహం ఉధృతంగా ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. కీసర వద్ద మున్నేరు, వైరా ఏరు, కట్టలేరు మూడు కలసి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
NH-65పై వరదనీటితో రాకపోకలు నిలిచిపోవడంతో... ఏపీ, తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సులను నందిగామ వద్ద నిలిపివేశారు. వరద తగ్గే వరకు బస్సులు నడపలేమని ఆర్టీసీ డ్రైవర్లు చెబుతున్నారు. వ్యక్తిగత వాహనాలు, చిన్న వాహనాలు నందిగామ నుంచి మధిర మీదుగా వెళ్తున్నాయి. ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లించేందుకు ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు, కానీ డ్రైవర్లు ససేమిరా అనడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. చాలామంది ప్రయాణికులు వరద ప్రవాహం చూసి వెనకడుగు వేస్తున్నారు. కానీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఎటూ వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో ఆగిపోయారు.