హైదరాబాద్ లోని టీఎన్ జీవో కేంద్ర కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి
టీఎన్ జీవోలు టీఆరెస్ కు అమ్ముడుపోయారంటూ నిన్న బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు చేయగా, ఈ రోజు ఆ పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లోని టీఎన్ జీవో కార్యాలయంపై దాడి చేశారు.
హైదరాబాద్ నాంపల్లి లోని టీఎన్ జీవో కేంద్ర కార్యాలయంపై బీజేపీ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కార్యాలయంలోకి బలవంతంగా చొచ్చుకవచ్చిన బీజేపీ కార్యకర్తలు, ఫర్నీచర్ ను, నాయకుల నేమ్ ప్లేట్లను ధ్వంస చేశారు.
రెండు రోజులుగా బీజేపీ నాయకులు టీఎన్ జీవో లపై కసిగా ఉన్నారు. మరో వైపు టీఎన్ జీవో నాయకులు టీఆరెస్ కు అమ్ముడు పోయారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించడంతో ఉద్యోగులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. బండి సంజయ్ కు వ్యతిరేకంగా టీఎన్ జీవోలు నిన్న హైదరాబాద్ లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. దాంతో మరింత మంటమీదున్న బీజేపీ నాయకులు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా టీఎన్ జీవో కార్యాలయంపై దాడి చేశారు.
బీజేపీ కార్యకర్తలు చేసిన దాడి పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. నాయకులెవరూ కార్యాలయంలో లేని సమయంలో ఇద్దరు మహిళలు మాత్రమే కార్యాలయంలో ఉండగా ఈ దుర్మార్గమైన దాడికి పాల్పడ్డారని ఉద్యోగ నాయకులు ఆరోపించారు. మేము కనుక తిరిగి దాడులకు సిద్దమైతే మీరు తెలంగాణలో తిరగలేరని, మీకార్యాలయానికి మా కార్యాలయం ఎంత దూరమో మా కార్యాలయానికి మీ కార్యాలయం అంతే దూరం అనే విషయం మర్చిపోవద్దని టీఎన్ జీవో నాయకులు ప్రతాప్ బీజేపీ నాయకులను హెచ్చరించారు.
మునుగోడులో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ నాయకులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని టీఎన్ జీవో మాజీ అధ్యక్షులు దేవీప్రసాద్ ఆరోపించారు.
మునుగోడులో ఓటమి భయంతో బరితెగించిన బీజేపీ...
— TRS Party (@trspartyonline) November 1, 2022
హైదరాబాద్ లోని టీఎన్జీవో భవనంపై దాడి చేసిన బీజేపీ గుండాలు.#MunugodeBypoll pic.twitter.com/2B3g7EkTJ4