ఆ కానిస్టేబుల్... 7 ముఠాలకు నాయకుడు..!
తనకు సహకరించిన పై అధికారులకూ వాటాలు ఇవ్వడం.. ఇది తన నిత్యకృత్యంగా మార్చుకున్నాడు. చోరీలు చేస్తున్న కుటుంబాలకు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలకు ఇచ్చేవాడు.
అతనో కానిస్టేబుల్.. టాస్క్‌ఫోర్స్‌లో పనిచేసిన అనుభవంతో.. నేరస్తులతో సంబంధాలు పెంచుకున్నాడు. వారిని తనకనుగుణంగా మలుచుకున్నాడు. తాను చెప్పినట్టు చేసేలా తయారు చేశాడు. ఇలా.. ఏకంగా ఏడు దొంగల ముఠాలను ఏర్పాటు చేశాడు. వారితో దొంగతనాలు చేయించడం.. పట్టుబడితే బెయిల్ ఇప్పించడం.. చోరీ సొత్తు విక్రయించి సొమ్ము చేసుకోవడం.. తనకు సహకరించిన పై అధికారులకూ వాటాలు ఇవ్వడం.. ఇది తన నిత్యకృత్యంగా మార్చుకున్నాడు. చోరీలు చేస్తున్న కుటుంబాలకు నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేలకు ఇచ్చేవాడు.
ఇప్పుడు అతని అవినీతి బాగోతం బట్టబయలైంది. నల్గొండ పోలీసు అధికారుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. దీంతో ఈ వ్యవహారంలో అతనికి సహకరించి వాటాలు అందుకున్న పై అధికారులు, ఇతర సిబ్బందిలో వణుకు మొదలైంది.
పోలీసులకు పట్టుబడిన ఇంటిదొంగ పేరు మేకల ఈశ్వర్. హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్. ఏపీలోని బాపట్ల జిల్లా స్టూవర్ట్‌పురం అతని స్వస్థలం. నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో అతను కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించాడు. నేర విభాగంలో పనిచేయడంతో దొంగలతో పరిచయాలు ఏర్పడ్డాయి. సొత్తు రికవరీలో చేతివాటం ప్రదర్శించేవాడు. కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలకు వాటాలు పంచేవాడని సమాచారం. ఏపీ, తెలంగాణల్లోని దొంగలతో స్నేహ సంబంధాలు పెంచుకుని.. వారితో దొంగల ముఠాలను ఏర్పాటు చేశాడు. వారి కుటుంబాల్లోని మహిళలు, పిల్లలతో ముఠాలు ఏర్పాటు చేసి హఫీజ్‌పేటలోని తన నివాసంలోనే వసతి కల్పించాడు.
పట్టుబడింది ఇలా..
నల్గొండలో ఇటీవల కాలంలో సెల్‌ఫోన్ల చోరీలు పెరిగిపోయాయి. దీంతో అక్కడి పోలీసు అధికారులు దీనిపై దృష్టిసారించారు. సీసీ టీవీ ఫుటేజీల సాయంతో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్ ఈశ్వర్ పేరు వెల్లడైంది. అతనే ఇవన్నీ చేయిస్తున్నాడని తెలుసుకుని.. ఈశ్వర్‌ని మూడు రోజులపాటు కస్టడీలోకి తీసుకున్నారు. పలు ప్రాంతాలకు తీసుకెళ్లి వివరాలు సేకరించారు. విచారణలో ముందు నేరం అంగీకరించని ఈశ్వర్‌కి.. హఫీజ్‌పేట, చీరాలలోని నివాసాల్లో నిందితులకు వసతి కల్పించడం.. కాల్ డేటా.. వంటి ఆధారాలు చూపడంతో అతను నేరం అంగీకరించక తప్పలేదు.
పలువురిపై లైంగిక దాడి ఆరోపణలు...
దొంగల ముఠాల్లోని ఇద్దరు మహిళలను బెదిరించి, వారిపై ఈశ్వర్ లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఇతని వేధింపులు తట్టుకోలేక ముఠాల్లోని పలువురు అజ్ఞాతంలోకి, మరికొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయినట్టు సమాచారం.
ఇంటి దొంగల్లో గుబులు...
ఈశ్వర్ అరెస్టుతో కొందరు సీఐలు, ఎస్సైల్లో గుబులు మొదలైనట్టు తెలిసింది. నలుగురు సీఐలు అతనికి సహకరించారనే సమాచారం మేరకు అంతర్గతంగా పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్టు సమాచారం. వీరిలో ఇద్దరు హైదరాబాద్, మరో ఇద్దరు సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే స్పెషల్ బ్రాంచి పోలీసులు దీనిపై సీపీ సీవీ ఆనంద్‌కు నివేదిక అందజేసినట్టు సమాచారం.