Telugu Global
Telangana

ఆకాశ నగరాల లిస్ట్ లో హైదరాబాద్ కి సెకండ్ ప్లేస్

ప్రపంచంలోనే ఎత్తయిన భవనాలు ఉన్న నగర జాబితాలో హాంకాంగ్‌ మొదటి స్థానంలో ఉండగా, షెన్‌ ఝెన్‌, న్యూయార్క్‌, దుబాయ్‌ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ లో ముంబై టాప్ ప్లేస్ లో ఉండగా హైదరాబాద్ ది రెండో స్థానం.

ఆకాశ నగరాల లిస్ట్ లో హైదరాబాద్ కి సెకండ్ ప్లేస్
X

ఓ మోస్తరు పట్టణాల్లో ఐదారు అంతస్తుల అపార్ట్ మెంట్లు చూస్తేనే కొన్నిసార్లు ఆశ్చర్యం వేస్తుంది. అక్కడక్కడా 10, 15, 20 అంతస్తుల బిల్డింగ్ లు కనపడితే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది. ఆకాశానికి నిచ్చెన వేసినట్టుగా ఉండే ఇలాంటి బిల్డింగ్ లు ఇప్పుడు చాలా చోట్ల కనపడుతున్నాయి. హైరైజ్ బిల్డింగ్ లు ఉన్న నగరాల లిస్ట్ తీస్తే భారత్ లో ముంబై తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. ఆకాశ హర్మ్యాలు ఉన్న నగరాల్లో ఢిల్లీ సహా మిగతా మెట్రోపాలిటన్ సిటీస్ ని వెనక్కు నెట్టింది హైదరాబాద్.

ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ సర్వీసెస్‌ సంస్థ "కోల్డ్‌ వెల్‌ బ్యాంకర్‌ రిచర్డ్‌ ఎల్లిస్‌" (CBRE) గ్రూప్ ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన భవనాలున్న నగరాలపై ఓ సర్వే చేపట్టింది. భారత్ లో కూడా ఈ సర్వే జరిగింది. మన దేశంలో అత్యథిక ఎత్తయిన నగరాలున్న జాబితాలో మొదట ముంబై ఉండగా, రెండో స్థానంలో హైదరాబాద్ ఉంది. గత తొమ్మిదేళ్లలో ఆకాశ హర్మ్యాల సంఖ్య హైదరాబాద్ లో విపరీతంగా పెరిగింది.

హైదరాబాద్‌ లో హైరైజ్‌ కల్చర్‌

ఎత్తయిన భవనాల్లో నివాసం ఉండటం స్టేటస్ సింబల్ గా భావిస్తున్న రోజులివి. వివిధ కార్పొరేట్ కంపెనీలు కూడా ఇలాంటి బిల్డింగ్ లలోనే తమ ఆఫీస్ లు ఉండాలని కోరుకుంటున్నాయి. అందుకే ఈ హైరైజ్ కల్చర్ పెరుగుతోంది. నిర్మాణ రంగంలో ఉన్న ప్రముఖ సంస్థలన్నీ ఇప్పుడు హైరైజ్ బిల్డింగ్ లను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో అత్యంత ఎత్తయిన భవనం కోకాపేటలో నిర్మాణ దశలో ఉంది. సాస్‌ కంపెనీ 58 అంతస్తుల్లో 236 మీటర్ల ఎత్తులో ఈ భవనాన్ని నిర్మిస్తోంది. 57 అంతస్తులు (200 మీటర్లు), 55 అంతస్తులు (204 మీటర్లు), 54 అంతస్తులు (214 మీటర్లు) ఎత్తులో కూడా ఈ కంపెనీ పలు భవనాలు నిర్మిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్నవాటి లెక్క తీస్తే.. 153 మీటర్ల ఎత్తులో 45 అంతస్తుల బిల్డింగ్ లు హైదరాబాద్ లో మూడు ఉన్నాయి.

ప్రపంచంలోనే ఎత్తయిన భవనాలు అత్యధికంగా ఉన్న నగర జాబితాలో హాంకాంగ్‌ మొదటి స్థానంలో ఉండగా, షెన్‌ ఝెన్‌, న్యూయార్క్‌, దుబాయ్‌ నగరాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ లో ముంబై టాప్ ప్లేస్ లో ఉండగా, దక్షిణాదికి సంబంధించి హైదరాబాద్ ది మొదటిస్థానం. దక్షిణాదిలో ఇతర ఏ నగరాల్లో కూడా హైదరాబాద్ లో ఉన్నన్ని హైరైజ్ బిల్డింగ్ లు లేవు.

First Published:  30 Jun 2023 7:14 AM IST
Next Story