Telugu Global
Telangana

ప్రపంచ దేశాలు కాదు పొమ్మంటే.. ఇస్రోను ఆదుకున్న హైదరాబాద్‌ సంస్థ

బాహుబలి రాకెట్ తయారీ కోసం అత్యంత ధృఢమైన స్టీల్ అవసరం అయ్యింది. రాకెట్ అంతరిక్షలోకి భారీ పేలోడ్ మోసుకెళ్లాలంటే మేరేజింగ్ స్టీల్‌తో తయారు చేయాలి.

ప్రపంచ దేశాలు కాదు పొమ్మంటే.. ఇస్రోను ఆదుకున్న హైదరాబాద్‌ సంస్థ
X

చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్‌ను సేఫ్‌గా ల్యాండ్ చేసి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు ఏ దేశమూ సాధించలేని ఘనత సాధించి.. మన అంతరిక్ష పరిశోధన బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. చంద్రయాన్-3 విజయవంతం అయ్యాక అమెరికా, యూకే, యూరోప్‌తో పాటు అన్ని దేశాలు వేనోళ్ల కొనియాడాయి. కానీ ఇవే దేశాలు చంద్రయాన్-3కి పలు అడ్డంకులు సృష్టించిన విషయం తెలుసా? రాకెట్ తయారీకి అవసరమైన ముడి సరుకును, టెక్నాలజీని ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలుసా? ఇప్పుడీ విషయాలు బహిర్గతం అయ్యాయి. ప్రపంచ దేశాలు సహాయ నిరాకరణ చేసినా.. హైదరాబాద్‌లో ఉన్న ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ.. ఇస్రోను ఆదుకున్నది. వివరాల్లోకి వెళితే..

చంద్రయాన్-3 కోసం ఇస్రో ఎల్వీఎం-3 అనే బాహుబలి రాకెట్‌ను ఉపయోగించింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌ వంటి భారీ పేలోడ్‌ను తీసుకెళ్లడానికి పటిష్టమైన రాకెట్ అవసరం. ఈ బాహుబలి రాకెట్ తయారీ కోసం అత్యంత ధృఢమైన స్టీల్ అవసరం అయ్యింది. రాకెట్ అంతరిక్షలోకి భారీ పేలోడ్ మోసుకెళ్లాలంటే మేరేజింగ్ స్టీల్‌తో తయారు చేయాలి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ స్టీల్ అందుబాటులో ఉన్నది. అమెరికా, ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ స్టీల్‌ను అమ్మడానికి నిరాకరించాయి. అంతే కాకుండా మరి కొన్ని దేశాలు అమ్మకుండా అడ్డుకున్నట్లు తెలుస్తున్నది. అప్పుడే ఇస్రో.. హైదరాబాద్‌లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిథాని)ని సంప్రదించింది.

బాహుబలి రాకెట్ కోసం పటిష్టమైన స్టీలు, ఇతర లోహాలు తయారు చేయడానికి మిథాని ముందుకు వచ్చింది. ఇండిజీనియస్ మేరేజింగ్ స్టీల్ టెక్నాలజీని ఉపయోగించి ఇస్రోకు అవసరమైన లోహాన్ని తయారు చేసి అందించినట్లు మిథాని సీఎండీ ఎస్కే ఝా తెలిపారు. ప్రపంచ దేశాలు ఇస్రో అభ్యర్థనను తిరస్కరించినా.. దేశీయంగా అవసరమైన లోహాలను ప్రభుత్వ రంగ కంపెనీయే తయారు చేసి ఇచ్చిందని ఆయన చెప్పారు.

హైదరాబాద్‌లోనే ఈ లోహాలను తయారు చేయడం వల్ల అదనపు ప్రయోజనాలు కూడా కలిగినట్లు చెప్పారు. అత్యంత క్వాలిటీ మెటీరియల్ తయారు చేయడం సాధ్యమైందని.. అంతర్జాతీయ మార్కెట్‌లో కొంటే ఇస్రోను మోసం చేసే అవకాశం కూడా ఉండేది. కానీ మనమే సొంతగా తయారు చేసుకోవడం వల్ల హై స్టాండర్డ్ క్వాలిటీతో లోహాలను తయారు చేశామని ఝా పేర్కొన్నారు. బాహుబలి రాకెట్ తయారీ కోసం ఉపయోగించిన మేరేజింగ్ స్టీల్‌ను ఇస్రోకు అందించడానికి ముందు 50 రకాల క్వాలిటీ టెస్టులను చేశామని.. అన్నింటిలో పాస్ అయిన తర్వాతే రా మెటీరియల్ సప్లయ్ చేసినట్లు మిథానీ తెలిపింది.

కార్బన్ లేకుండా ఐరన్-నికెల్ లోహాలకు కోబాల్డ్, మాలిబ్డినమ్, టైటానియం, అల్యూమినియం కలిపి మేరేజింగ్ స్టీల్ తయారు చేస్తారు. ఈ స్టీలును రాకెట్ల తయారీకి ఉపయోగిస్తారు. గతంలో కూడా ఇస్రోకు పలు లోహాలను మిథానీ సప్లయ్ చేసింది. బాహుబలి రాకెట్ కోసం ప్రత్యేకమైన స్టీల్ కావాల్సి వచ్చినప్పుడు కూడా మిథానీయే ఆ టాస్క్ పూర్తి చేయడం విశేషం. హైదరాబాద్‌లోని మిథానీ భవిష్యత్‌లో కూడా ఇస్రోతో కలిసి నడవటానికి ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నది.

First Published:  8 Sept 2023 9:34 AM IST
Next Story