Telugu Global
Telangana

హైదరాబాద్ తో బెంగళూరుకి భారీ నష్టం..

అంతర్జాతీయ కంపెనీలు భారత్ లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేయాలనుకుంటే వాటికి ఏకైక ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నిలుస్తోంది. ఇప్పటి వరకూ అందరి చూపు బెంగళూరుపై ఉండేది. కానీ 2023 తొలి అర్థభాగంలో ఆ రికార్డ్ హైదరాబాద్ సొంతం చేసుకుంది.

హైదరాబాద్ తో బెంగళూరుకి భారీ నష్టం..
X

బెంగళూరు జైత్రయాత్రకు బ్రేక్ పడింది. ఇకపై బెంగళూరు క్రెడిట్ అంతా హైదరాబాద్ కే సొంతం అవుతుంది. అవును, ఇప్పటి వరకూ ఐటీ రంగంలో బెంగళూరు దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇప్పుడు ఆ నేమ్, ఫేమ్ హైదరాబాద్ దక్కించుకుంటోంది. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఉద్యోగ అవకాశాల్లో 44శాతం హైదరాబాద్ సొంతమవుతున్నాయి. తాజాగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్(GCC) ఏర్పాటులో బెంగళూరుని వెనక్కు నెట్టింది తెలంగాణ రాజధాని.

GCCలకు పెట్టింది పేరు..

అంతర్జాతీయ కంపెనీలు భారత్ లో తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేయాలనుకుంటే వాటికి ఏకైక ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నిలుస్తోంది. ఇప్పటి వరకూ అందరి చూపు బెంగళూరుపై ఉండేది. కానీ 2023 తొలి అర్థభాగంలో ఆ రికార్డ్ హైదరాబాద్ సొంతం చేసుకుంది. ఈ ఏడాది తొలి సగంలో భారత్ కి తరలి వచ్చిన GCCల్లో అత్యథికం హైదరాబాద్ లోనే ఏర్పాటయ్యాయి. బెంగళూరు రెండో స్థానంలో నిలిచింది.

అంతర్జాతీయ బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ దిగ్గజం గోల్డ్ మన్ శాక్స్ తన ఇంజినీరింగ్‌ సర్వీసెస్ కోసం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తోంది. ఫెడెక్స్ సంస్థ ఇన్నోవేషన్ సెంటర్ హైదరాబాద్ కే తెస్తోంది. లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్, అపోలో టైర్స్, పై స్క్వేర్, వార్నర్ బ్రదర్స్, డిస్కవరీ వంటి సంస్థలు కూడా GCCల ఏర్పాటుకి హైదరాబాద్ ని ఎంపిక చేసుకోవడం విశేషం.

ఎందుకీ మార్పు..?

ఇన్నాళ్లూ ఐటీరంగంలో హైదరాబాద్ టైర్-1 సిటీస్ తో పోటీపడేది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఐటీరంగం అభివృద్ధికి తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయా కంపెనీలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, ఇతర సౌకర్యాలు, హైదరాబాద్ అభివృద్ధి.. ఇలా అన్ని కారణాలతో అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడకు క్యూ కడుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ తరపున ఐటీ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటనలు కూడా హైదరాబాద్ ఐటీ అభివృద్ధికి దోహదపడుతున్నాయి. మంత్రి బృందం పర్యటనల్లోనే దాదాపుగా కీలక ఒప్పందాలన్నీ ఖరారవుతున్నాయి.

ట్రిపుల్ ఐటీ, ఐఎస్బీ, బిట్స్ పిలానీ వంటి సంస్థల నుంచి లభిస్తున్న మానవ వనరులు ఆయా కంపెనీల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగకరం. ప్రపంచంలోనే అతి పెద్దదిగా చెబుతున్న హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ ఫార్మాసుటికల్ ఇండస్ట్రీ క్లస్టర్ కోసం ఇప్పటికే 500 అంతర్జాతీయ ఫార్మా కంపెనీలు ఆసక్తి వ్యక్తం చేయడం విశేషం. వచ్చే ఏడెనిమిదేళ్లలో బెంగళూరుని దాదాపు అన్నిరంగాల్లో హైదరాబాద్ వెనక్కి నెట్టడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.

First Published:  5 Sept 2023 12:23 PM IST
Next Story