Telugu Global
Telangana

ఆరోజు కేటీఆర్ సలహా పాటించి ఉంటే..

ఆరోజు కేటీఆర్ సలహాను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఉంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు.

ఆరోజు కేటీఆర్ సలహా పాటించి ఉంటే..
X

ఇటీవల తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు దాదాపు 17మంది మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ పరిధిలో ఓ బాలుడు, మరో లాయర్ మృతిచెందగా.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా బాధిత కుటుంబాలను కలసి పరామర్శించారు. ఆర్థిక సాయం కూడా చేశారు. అదే సమయంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికి కీలక సూచన చేశారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. పాడుబడిన భవనాలలో ఉన్నవారిని పునరావాస శిబిరాలకు తరలించాలని, ప్రాణ నష్టాన్ని అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.


ఆరోజు కేటీఆర్ సలహాను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని ఉంటే ఈరోజు ఈ దుర్ఘటన జరిగి ఉండేది కాదు. తాజాగా.. హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధి బాబుల్ రెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. వర్షంతో పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లలు తీవ్ర గాయాలపాలై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మృతులు బీహార్ వాసులుగా గుర్తించారు. చిన్నారులంతా ఇంటి ముందు ఆడుకుంటుండగా గోడ కూలి ప్రమాదం సంభవించింది. హైదరాబాద్ నగరంలో వర్షాలకు కూలిపోయే గోడలున్న ఇళ్లు చాలానే ఉన్నాయి. మిగతా సందర్భాల్లో కాకపోయినా, కనీసం వర్షాల సమయంలో అయినా అలాంటి ప్రాంతాల్లో ఉన్నవారిని అప్రమత్తం చేస్తే ఫలితం ఉంటుంది. పాడుబడిన భవనాలు, ఇళ్ల గోడలు, వర్షాలకు నాని కూలిపోతాయి. తప్పనిసరి పరిస్థితుల్లో అలాంటి ప్రాంతాల్లో ఉన్నవారికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడినట్టవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేకపోవడం విశేషం. అధికార పార్టీలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపించిన మేయర్ విజయలక్ష్మి, ఇలాంటి విషయాల్లో మాత్రం మీనమేషాలు లెక్కిస్తుంటారనే విమర్శలు వినపడుతున్నాయి.

భగభగ మండే ఎండలతో సతమతం అయిన నగరవాసికి వానలు ఊరటనిచ్చాయి. అదే సమయంలో కొన్ని కుటుంబాల్లో ఈ వర్షాలు విషాదాన్ని నింపాయి. ఆడుకునే పసిపిల్లలు కళ్లముందే చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.

First Published:  3 Jun 2024 1:55 PM IST
Next Story