Telugu Global
Telangana

హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్నారా? ఇకపై పోలీసులు మీకు అండగా ఉంటారు!

వేధింపులకు గురి చేసేవాళ్లు, మోసగాళ్లకు చెక్ పెట్టేలా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సరికొత్త హెల్ప్ లైన్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లు తెలిపారు.

హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్నారా? ఇకపై పోలీసులు మీకు అండగా ఉంటారు!
X

ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు అన్నారు పెద్దలు. కొడుకు/కూతురికి పెళ్లి చేయడానికి ఎంత కష్టాలు పడాలో.. ఇల్లు కట్టాలన్నా అంతే కష్టపడాలి. నిజం చెప్పాలంటే ప్రస్తుతం పెళ్లి చేయడం కంటే.. ఇల్లు కట్టడానికే ఎక్కువ కష్టపడాలి. ముఖ్యంగా విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో సరైన పత్రాలు ఉన్న ఖాళీ జాగా దొరకడం కష్టం. ఆ తర్వాత పర్మిషన్లు, ప్లాన్లు, మెటీరియల్ కోసం చాలా కష్టపడాలి. అన్నీ కుదిరినా.. స్థానిక కార్పొరేటర్, గల్లీ లీడర్లు, రౌడీల నుంచి వచ్చే వేధింపులు మామూలుగా ఉండవు. అవసరం అయితే, ఓకే అయిన ప్లాన్‌ను కూడా రద్దు చేయించే అంత పలుకుబడి కొంత మందికి ఉంటుంది.

ఇన్ని కష్టాల మధ్య ఇల్లు కట్టాలంటే సామాన్యుడికి తడిసి మోపెడు అవుతుంది. అయితే ఇకపై ఇలాంటి వేధింపులు ఉండవని హైదరాబాద్ సిటీ పోలీసులు చెబుతున్నారు. వేధింపులకు గురి చేసేవాళ్లు, మోసగాళ్లకు చెక్ పెట్టేలా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సరికొత్త హెల్ప్ లైన్‌ను అందుబాటులోకి తీసుకొని వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌కు తెలంగాణలోని ఇతర జిల్లాల నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా స్థిరపడే వాళ్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్లు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలనుకుంటే వారికి అండగా ఉంటామని పోలీసులు భరోసా ఇస్తున్నారు.

గ‌ృహ ప్రవేశాలు, వాణిజ్య వ్యాపార ప్రారంభోత్సవాల సందర్భంగా హిజ్రాలు వచ్చి డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ తెలిపారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిపై ఫిర్యాదులు చేసేందుకు ఎట్టి పరిస్థితులలోనూ వెనకాడవద్దని కోరారు. టాస్క్‌ఫోర్స్, ప్రత్యేక బృంధాల సిబ్బందితో బలవంతపు వసూళ్లు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన హెచ్చరించారు.

'హైదరాబాద్ నగరంలో ఇళ్లు కట్టుకునే వారిని ఎవరైనా డబ్బులు ఇవ్వాలని వేధింపులకు గురిచేస్తే వెంటనే స్థానిక పోలీసు స్టేషన్లలో, డయల్ 100 లేదా హైదరాబాద్ పోలీసు వాట్సప్ నెంబర్ 9490616555 కు ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గారు నగర ప్రజలకు సూచించారు' అంటూ హైదరాబాద్ సిటీ పోలీసులు ట్వీట్ చేశారు.

First Published:  23 Dec 2022 1:52 PM IST
Next Story