నెంబర్ ప్లేట్ గజిబిజిగా ఉంటే బండి ఆపేస్తారు జాగ్రత్త..
చైన్ స్నాచర్లు, అంతర్ రాష్ట్ర నేరస్తులు.. బైక్ లపై ప్రయాణిస్తూ నెంబర్ ప్లేట్ల విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా సీసీ కెమెరాలకు కూడా దొరక్కుండా వారు తప్పించుకుంటున్నారు.
బైక్ పై వెళ్తూ హెల్మెట్ పెట్టుకోకపోతే పోలీసులు ఆపేస్తారు. కొన్నిసార్లు లైసెన్స్, ఆర్సీకోసం బైక్ లను ఆపుతుంటారు. అయితే ఇకపై నెంబర్ ప్లేట్ విషయంలో తప్పులున్నా బండిని ఆపేస్తాం జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. బండి నెంబర్ స్పష్టంగా లేకపోతే వెంటనే ఆపి చెక్ చేస్తున్నారు. తేడా ఉంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
నెంబర్ ప్లేట్ స్పష్టంగా ఉండాలి..
చైన్ స్నాచర్లు, అంతర్ రాష్ట్ర నేరస్తులు.. బైక్ లపై ప్రయాణిస్తూ నెంబర్ ప్లేట్ల విషయంలో తెలివిగా వ్యవహరిస్తున్నారని హైదరాబాద్ పోలీసులు తేల్చారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా సీసీ కెమెరాలకు కూడా దొరక్కుండా వారు తప్పించుకుంటున్నారు. నెంబర్ ప్లేట్ ని ట్యాంపర్ చేయడం.. అంకెలు, అక్షరాలు గజిబిజిగా ఉండేలా చేయడం వల్ల.. బైక్ ల ఆధారంగా నేరస్తుల్ని పట్టుకోవడం కష్టతరమవుతోంది. ముఖ్యంగా నగరంలో చైన్ స్నాచర్లు ఈ ట్రిక్ ద్వారా తప్పించుకుంటున్నారు. దీనిపై పోలీసులు దృష్టిసారించారు. ప్రస్తుతం రోజువారీ తనిఖీల్లో 300నుంచి 350 ట్యాంపరింగ్ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు రాచకొండ పోలీస్ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్. ఆ కేసుల సంఖ్యను సున్నాకు తగ్గించడమే తమ లక్ష్యం అని చెప్పారు.
ఈవ్ టీజింగ్ కేసులు తగ్గిపోయాయి..
మహిళల భద్రత కోసం విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్ల వద్ద పెట్రోలింగ్ వాహనాలతో గస్తీ కాస్తున్నామని తెలిపారు రాచకొండ కమిషనర్. రెడ్ హ్యాండెడ్ గా, సీసీటీవీ కెమెరాలతో పోకిరీలను గుర్తించి, కేసులు నమోదు చేస్తున్నామన్నారు. షీ టీమ్స్, సైబర్ క్రైమ్ టీమ్ లు సంయుక్తంగా కలిసి విద్యా సంస్థలలో మహిళలు, సైబర్ భద్రతలపై అవగాహన కల్పిస్తున్నట్టు తెలిపారు. సున్నితమైన ప్రాంతాలలో కమిటీలు, గ్రూప్ లు, రెసిడెన్షియల్ సంఘాలతో కలిసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తున్నామని పేర్కొన్నారు.