హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలకు పోలీసుల నిబంధనలు ఇవే
Hyderabad New Year Guidelines 2023: న్యూ ఇయర్ రోజు రాత్రి 1.00 వరకు 3 స్టార్, అంత కంటే పెద్ద హోటల్స్, పబ్బులు, క్లబ్స్‌లో వేడుకలు నిర్వహించుకోవాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు.
2022 ముగియడానికి మరి కొన్ని రోజులే ఉన్నది. 2023 కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టే వేళ ప్రపంచమంతా సంబరాల్లో మునిగిపోతుంది. ఇక మెట్రో నగరమైన హైదరాబాద్‌లో కూడా న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా సాగుతాయి. న్యూఇయర్ ఈవెంట్స్, పబ్స్‌లో స్పెషల్ పార్టీలు, స్టార్ హోటళ్లలో హంగామాతో పాటు ప్రతీ రోడ్డు, బారు, వైన్స్ దగ్గర ఫుల్ సందడి నెలకొంటుంది. అయితే న్యూ ఇయర్ వేడుల సమయంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా చూసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు పలు నిబంధనలు విధించారు.
న్యూ ఇయర్ రోజు రాత్రి 1.00 వరకు 3 స్టార్, అంత కంటే పెద్ద హోటల్స్, పబ్బులు, క్లబ్స్‌లో వేడుకలు నిర్వహించుకోవాలంటే తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. 10 రోజుల ముందుగానే ఇందుకు సంబంధించిన అనుమతి తప్పని సరిగా తీసుకోవాలని పోలీసులు తెలిపారు. అంతే కాకుండా వేడుకలు నిర్వహించే ప్రదేశంలో తప్పకుండా సీసీ కెమేరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈవెంట్ జరిగే ప్రదేశం ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ పాయింట్లతో సీసీ కెమేరాలు తప్పని సరి అని తెలిపారు.
ఇక ఏ వేడుకలోనూ అసభ్యకరమైన నృత్యాలను అనుమతించబోమని, అలాగే అల్లర్లు కూడా జరుగకుండా యాజమాన్యాలు సెక్యూరిటీని నియమించుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం యాజమాన్యాలు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరిగే ప్రాంతంలో సౌండ్/మ్యూజిక్ తీవ్రత 45 డెసిబెల్స్‌ను మించకూడదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. ప్రతీ ఒక్కరినీ క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతించాలని, మారణాయుధాలతో ఎవరినీ రానివ్వకూడదని కచ్చితంగాచ చెప్పారు.
వేడుకలు జరిగే ప్రదేశం కెపాసిటీని బట్టే టికెట్లు అమ్మాలని, పరిమితికి మించి అమ్మితే చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా, తప్పకుండా ప్రత్యేకమైన పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పబ్బులు, బార్లలో నిర్వహించే వేడుకలకు మైనర్లను అనుమతించరాదని, వేడుకల్లో మాదక ద్రవ్యాలు సరఫరా జరుగకుండా చూడాల్సిన బాధ్యత యాజమాన్యందే అని ఆయన తెలిపారు. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ తర్వాత మద్యం తాగి వాహనం నడపకూడదని, వేడుకలకు వచ్చిన వాళ్లు తిరిగి ఇంటికి చేరేలా చూసే బాధ్యత నిర్వాహకులదే అని పోలీసులు తెలిపారు. నిర్ణీత సమయం తర్వాత లిక్కర్ సప్లయ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.