Telugu Global
Telangana

సునీల్ కనుగోలును ఏ1గా తేల్చిన పోలీసులు.. సీక్రెట్ ఆఫీసు నుంచి దుష్ప్రచారం

కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు మాధాపూర్‌లోని మైండ్‌షేర్ యునైటెడ్ ఫౌండేషన్ కార్యాలయంలో చాలా రహస్యంగా ఒక ఆఫీస్ నిర్వహిస్తున్నట్లు తేలింది.

సునీల్ కనుగోలును ఏ1గా తేల్చిన పోలీసులు.. సీక్రెట్ ఆఫీసు నుంచి దుష్ప్రచారం
X

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు చాలా సీక్రెట్‌గా నడుపుతున్న కార్యాలయం నుంచే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టినట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ అనేక నకిలీ అకౌంట్ల ద్వారా ఫేక్ ప్రచారం చేస్తున్నారని, అంతే కాకుండా అనుచిత పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులు అందాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన సైబర్ క్రైమ్.. మాధాపూర్‌లోని ఓ కార్యాలయం నుంచే ఈ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. దీంతో మంగళవారం అర్థరాత్రి సదరు కార్యాలయానికి చేరుకొని అక్కడ సోదాలు నిర్వహించారు.

కాగా, కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు మాధాపూర్‌లోని మైండ్‌షేర్ యునైటెడ్ ఫౌండేషన్ కార్యాలయంలో చాలా రహస్యంగా ఒక ఆఫీస్ నిర్వహిస్తున్నట్లు తేలింది. గత ఆరు నెలలుగా ఈ కార్యాలయంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఐపీ అడ్రస్‌ల ద్వారా లొకేషన్ కనుక్కున్న పోలీసులు సదరు ఆఫీసుకు చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న మెండా శ్రీప్రతాప్, శశాంక్, ఇషాంత్ శర్మలను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, సునీల్ కనుగోలు నిర్వహిస్తున్న సీక్రెట్ ఆఫీస్‌లో పోలీసులు సోదాలు చేస్తున్నట్లు తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడికి వచ్చి హడావిడి చేశారు. మూడు గంటల సేపు అక్కడ హై డ్రామా కొనసాగింది.

సునీల్ కనుగోలు ఆఫీసులో జరిగిన సోదాలకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్ వివరించారు. రాత్రి జరిపిన సోదాల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, ఎవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు. వారిని పూర్తిగా విచారించిన తర్వాతే.. సదరు సీక్రెట్ ఆఫీసును సునీల్ కనుగోలు నిర్వహిస్తున్నట్లు తెలిసిందని సీపీ చెప్పారు. అప్పటి వరకు ఆ కార్యాలయం ఎవరికి చెందిందో పోలీసులకు అవగాహన లేదన్నారు. అక్కడి నుంచే నకిలీ ఖాతాల ద్వారా పలువురిపై దుష్ప్రచారం జరిగినట్లు కూడా తేలిందన్నారు. ప్రస్తుతం సునీల్ పరారిలో ఉన్నారని, మైండ్ షేర్ యునైటెడ్ ఫౌండేషన్ పేరుతో కార్యాలయం రిజిస్టర్ చేసినట్లు ఆయన చెప్పారు. అయితే, ఈ ఆఫీస్ ఏ రాజకీయ పార్టీ పేరుతో రిజిస్టర్ కాలేదని స్పష్టం చేశారు. ఈ కేసులో సునీల్‌ను ప్రధాన నిందితుడిగా (ఏ1) చేర్చినట్లు సీపీ వెల్లడించారు.

రాత్రి అదుపులోకి తీసుకున్న ముగ్గురికి 41 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేసి వదిలిపెట్టామని సీపీ తెలిపారు. పది ల్యాప్ టాప్‌లు, మొబైల్ ఫోన్లు, సీపీయూలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు చేయడం సహజమే. రాజకీయాల్లో విమర్శలు ఆరోగ్యకరంగా ఉంటే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ ఈ కార్యాలయం నుంచి కొందరిని టార్గెట్ చేశారని అన్నారు. ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం విమర్శ కిందకు రాదని అన్నారు. విమర్శ చేయాలనుకునే వాళ్లు ధైర్యంగా వాళ్లు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పగలగాలి.. అంతే కానీ ఎవరికీ అర్థంకాని పేరుతో.. ఎదుటి వ్యక్తులపై పోస్టులు పెట్టడం తగదన్నారు.

తమ ఐటెంటిటీ ఇతరులకు తెలియకూడదనే ఫేక్ పేర్లతో, ఐపీ మాస్కింగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతతో వీరిని గుర్తించడం కష్టమేమీ కాదని సీపీ చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో 5 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయన్నారు దర్యాప్తు పూర్తిగా చట్ట ప్రకారమే కొనసాగుతోందని సీపీ విక్రమ్ మాన్ సింగ్ వెల్లడించారు.

First Published:  14 Dec 2022 12:56 PM
Next Story