Telugu Global
Telangana

డ్రగ్స్ రాకెట్ ఛేదించిన హైదరాబాద్ పోలీస్..

దేశవ్యాప్తంగా డార్క్ వెబ్ ద్వారా వేలాది మందికి ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మీడియా సమావేశంలో కమిషనర్ సీవీ ఆనంద్ డ్రగ్స్ ముఠా వివరాలు వెల్లడించారు.

డ్రగ్స్ రాకెట్ ఛేదించిన హైదరాబాద్ పోలీస్..
X

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టు చేశారు పోలీసులు. పట్టుబడిన ప్రతిసారీ డ్రగ్స్ దందాకు నేరగాళ్లు కొత్తమార్గం ఎంచుకుంటున్నారు. ఈసారి పక్కా ప్లాన్ ప్రకారం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. డార్గ్ వెబ్ అనే సాఫ్ట్ వేర్ ద్వారా డ్రగ్స్ కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతున్నాయని, క్రిప్టో కరెన్సీ ద్వారా పేమెంట్స్ జరుగుతున్నాయని నిర్థారించారు. గోవా, రాజస్థాన్, ఢిల్లీకి చెందిన డ్రగ్ సప్లయర్స్ ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇద్దరు అంత‌ర్రాష్ట్ర డ్రగ్ సప్లయర్స్ తోపాటు, ఆరుగురు హైదరాబాద్ వాసులను కూడా అదుపులో తీసుకున్నారు. దేశవ్యాప్తంగా డార్క్ వెబ్ ద్వారా వేలాది మందికి ఈ ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. మీడియా సమావేశంలో కమిషనర్ సీవీ ఆనంద్ డ్రగ్స్ ముఠా వివరాలు వెల్లడించారు.

కొరియర్ లో డ్రగ్స్..

డ్రగ్స్ రవాణాకు పార్శిల్ సర్వీస్ లను ఈ ముఠా ఎంచుకోవడం విశేషం. ఆన్ లైన్ కొనుగోళ్లు పెరిగిన తర్వాత ఇప్పుడు కొరియర్ బాయ్ లకు డిమాండ్ బాగా పెరిగింది. నచ్చిన వస్తువుని, కోరిన క్షణంలోనే ఇంటి ద‌గ్గ‌ర‌ తీసుకోవచ్చు. సహజంగా ఇలాంటివాటిపై ఇప్పుడు ఎవరికీ అనుమానం రావట్లేదు. దీంతో డ్రగ్స్ కూడా కొరియర్ బాయ్స్ ద్వారా ఎవరికీ తెలియకుండా సరఫరా చేస్తున్నారు. కొరియర్ సంస్థలకి కూడా అనుమానం రాకుండా వేర్వేరు అడ్రస్ ల నుంచి పార్శిల్స్ పంపిస్తున్నారు.

డ్రగ్స్ వినియోగిస్తున్న వారంతా ఉన్నత విద్యావంతులని చెప్పారు సీపీ సీవీ ఆనంద్. వారి వద్దనుంచి 140 గ్రాముల చరస్, 1450 గ్రాముల గంజాయి, 184 బ్లాట్స్ LSD, 10 గ్రాముల MDMA స్వాధీనం చేసుకున్నారు. నరేంద్ర ఆర్య అనే వ్యక్తి గోవా నుంచి ఈ నెట్ వర్క్ ని లీడ్ చేస్తున్నట్టు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఇతనికి 4వేలమంది కస్టమర్లు ఉన్నట్టు తేలింది. హైదరాబాద్ లో ప్రస్తుతానికి ఐదుగురు వినియోగదారులున్నట్టు గుర్తించారు.

కొరియర్ ఏజెన్సీలకు హెచ్చరిక..

కొరియర్ ఏజెన్సీలు స్కానర్స్ పెట్టుకోవాలని, కొరియర్స్ లో ఏమున్నాయో చూసుకోవాలని సూచిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. డ్రగ్స్ సప్లయర్స్ మామూలు కొరియర్స్ లాగే డ్రగ్స్ పార్శిల్స్ ని పంపిస్తున్నారని, కొరియర్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు వచ్చే కొరియర్స్ పై ఓ కన్నేసి ఉంచాలని అంటున్నారు పోలీసులు. భారీ డ్రగ్స్ రాకెట్ ని హైదరాబాద్ పోలీసులు ఛేదించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

First Published:  1 Sept 2022 3:41 PM IST
Next Story