హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. - హైదరాబాద్ కేంద్రం.. దేశవ్యాప్తంగా నెట్‌వర్క్
దేశవ్యాప్తంగా ఉండే ఆర్గనైజర్ల కింద కొంతమంది బ్రోకర్లు ఉంటారు. వారు ఉద్యో్గాలు ఇప్పిస్తామంటూ పేద మహిళలకు ఎర వేస్తారు. ఆ తర్వాత బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతారు.
హైదరాబాద్ కేంద్రంగా నడుపుతున్న హైటెక్ వ్యభిచారం, మాదక ద్రవ్యాల సరఫరా ముఠా గుట్టు రట్టయింది. 14,190 మంది యువతులతో వీరు హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఉద్యోగాల పేరుతో దేశ, విదేశీ యువతులను ఆకర్షించి, బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని పోలీసుల పరిశీలనలో వెల్లడైంది. ఈ కేసుకు సంబంధించి గచ్చిబౌలిలోని రాడిసన్ బ్లూ హోటల్ మేనేజర్ రాకేష్ సహా 18 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వ్యభిచారంతో పాటు మాదక ద్రవ్యాలను కూడా సరఫరా చేస్తున్న ఈ ముఠా వివరాలను ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ డీసీపీ కవితతో కలిసి సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మంగళవారం ఈ వివరాలు వెల్లడించారు.
వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపుల్లో యువతుల వివరాలు...
విటులను ఆకర్షించేందుకు వివిధ వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపుల్లో యువతుల ఫొటోలు, వివరాలు పెట్టి.. కాల్ సెంటర్ల ద్వారా విటులను ఆకర్షిస్తుంటారు ఈ ముఠా నిర్వాహకులు. హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఏళ్లుగా ఈ దందా నిర్వహిస్తున్నారు.
ఒక్కో వాట్సాప్ గ్రూపులో 300 మంది ఆర్గనైజర్లు...
మొత్తం 17 మంది ప్రధాన ఆర్గనైజర్లు వేర్వేరు రాష్ట్రాల్లో వాట్సాప్ గ్రూపుల ద్వారా దందా సాగిస్తున్నారు. ఒక్కో వాట్సాప్ గ్రూపులో 300 మంది ఆర్గనైజర్లు సభ్యులుగా ఉన్నారు. బేగంపేటకు చెందిన మహ్మద్ సల్మాన్ ఖాన్ అలియాస్ సమీర్ హోటళ్లలో పనిచేస్తూ ఓ వ్యభిచార ముఠా బాధితురాలు అక్కడ బస చేయడం గమనించాడు. సులభంగా డబ్బు సంపాదించేందుకు దీనిని మార్గంగా ఎంచుకున్నాడు. సోమాజిగూడ కేంద్రంగా 2016 నుంచి వ్యభిచార కేంద్రం నిర్వహించడం ప్రారంభించాడు. డ్రగ్స్ అలవాటు ఉన్న సమీర్.. మరో డ్రగ్ వినియోగదారుడు, మాసాబ్‌ట్యాంక్‌కు చెందిన మహ్మద్ అదీమ్ అలియాస్ అర్నవ్‌తో కలసి ఈ కేంద్రం నిర్వహిస్తున్నాడు.
వీరి దందా సాగేదిలా..
దేశవ్యాప్తంగా ఉండే ఆర్గనైజర్ల కింద కొంతమంది బ్రోకర్లు ఉంటారు. వారు ఉద్యో్గాలు ఇప్పిస్తామంటూ పేద మహిళలకు ఎర వేస్తారు. ఆ తర్వాత బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతారు. బాధిత యువతుల ఫొటోలు, వివరాలు దేశవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెడతారు. దీంతో పాటు పలు కాల్ గరల్స్ వెబ్‌సైట్లలోనూ వీటిని పోస్ట్ చేస్తారు. వాటిని చూసిన విటులు తమకు నచ్చిన అమ్మాయిల కోసం అందులోని వాట్సాప్ నంబర్లకు ఫోన్ చేస్తారు. కాల్ సెంటర్ల నిర్వాహకులు అమ్మాయిల వివరాలు, రేట్లు తెలిపి.. ఏ హోటల్‌కి వెళ్లాలో చెబుతారు. డీల్ కుదిరిన అనంతరం చెల్లింపులు ఆన్‌లైన్ లేదా నగదు రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తంలో 30 శాతం అమ్మాయికి, 35 శాతం అమ్మాయిల ఫొటోలను ప్రచారం చేసేవారికి, మిగతా 35 శాతం నిర్వాహకులు వాటాలుగా పంచుకుంటారు. విటులతో సంప్రదింపుల కోసం నిర్వాహకులు హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులలో కాల్ సెంటర్లు సైతం ఏర్పాటు చేశారు.
ఏపీ, తెలంగాణ, పశ్చిమబెంగాల్, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, కోల్‌కతా, అసోం రాష్ట్రాల యువతులతో పాటు థాయ్‌లాండ్, నేపాల్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, రష్యా దేశాల మహిళలతో వీరు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విదేశీ మహిళలకు నకిలీ పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు సృష్టించి వివిధ నగరాలకు వారిని తరలిస్తున్నారు.
గుట్టు బయటపడిందిలా..
ఇటీవల వ్యభిచారం చేస్తూ పట్టుబడిన యువతులను ప్రశ్నించిన పోలీసులు.. గత నెల 15న బేగంపేటకు చెందిన సల్మాన్, పీ అండ్ టీ సన్‌సిటీకి చెందిన మహ్మద్ అబ్దుల్ కరీంలను అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారణ చేయగా, దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ పెట్టుకుని నిర్వహిస్తున్న ఈ హైటెక్ ముఠా గుట్టు రట్టయింది. తాజాగా పోలీసులు అరెస్టు చేసిన 18 మంది సైబరాబాద్, హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 39 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. నిందితుల నుంచి 34 సెల్‌ఫోన్లు, 3 కార్లు, ఒక ల్యాప్‌టాప్, 2.5 గ్రాముల ఎండీఎంఏ (మాదక ద్రవ్యం), రూ.75 వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.