Telugu Global
Telangana

కండలు పెంచేందుకు అడ్డదారులు.. పోలీసుల అదుపులో జిమ్ ట్రైనర్లు

ఆపరేషన్ థియేటర్లలో శరీరంలో రక్త ప్రసరణ స్థాయిలు తగ్గినప్పుడు వాటిని పెంచడానికి ఈ ఇంజెక్షన్లు వినియోగిస్తారు. కానీ జిమ్ ట్రైనర్లు వీటిని ఢిల్లీనుంచి ప్రత్యేకంగా తెప్పించి విక్రయిస్తున్నారు.

కండలు పెంచేందుకు అడ్డదారులు.. పోలీసుల అదుపులో జిమ్ ట్రైనర్లు
X

కండలు పెంచాలంటే వ్యాయామశాలల్లో చెమటోడ్చాలి. అరగంట, గంటసేపు జిమ్ చేస్తే కొవ్వు కరుగుతుంది కానీ, కండలు పెరగవు. ఎక్కువసేపు జిమ్ లో ఉండాలంటే కచ్చితంగా దానికి తగ్గ స్టామినా ఉండాలి. కసరత్తులు చేయాలనే కోరిక ఉన్నా చాలామందికి గంటకంటే ఎక్కువసేపు ఓపిక ఉండదు. అలాంటివారిని ఎంపిక చేసుకుని వారికి ప్రొటీన్ పౌడర్ అలవాటు చేస్తుంటారు జిమ్ ట్రైనర్లు. అదనంగా మరో అరగంట జిమ్ చేసేలా ప్రోత్సహిస్తారు. ప్రొటీన్ అధికంగా, అది కూడా పౌడర్ రూపంలో తీసుకుంటే ప్రమాదమే. అయితే దీనికి ఎక్స్ ట్రీమ్ లెవల్ దందా ఇప్పుడు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పలు జిమ్ లలో జరుగుతోంది. ప్రొటీన్ పౌడర్ కి బదులుగా మెఫంటెర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్లు వినియోగిస్తున్నారు కొంతమంది.

ఎందుకీ ఇంజెక్షన్లు..?

మెఫంటెర్మైన్ సల్ఫేట్ అనే ఇంజెక్షన్ శరీరంలో రక్తప్రసరణ పెంచుతుంది. సాధారణంగా ఆపరేషన్ థియేటర్లలో శరీరంలో రక్త ప్రసరణ స్థాయిలు తగ్గినప్పుడు వాటిని పెంచడానికి ఈ ఇంజెక్షన్లు వినియోగిస్తారు. వైద్యుల సూచన మేరకే ఈ ఇంజెక్షన్లు వాడాలి. కానీ జిమ్ ట్రైనర్లు వీటిని ఢిల్లీనుంచి ప్రత్యేకంగా తెప్పించి విక్రయిస్తున్నారు. వీటిని తీసుకుంటే అదనంగా మరో గంటసేపు జిమ్ లో కసరత్తులు చేయొచ్చు కానీ, రక్తప్రసరణ ఒక్కసారిగా పెరిగిపోయి గుండెపోటుతో కుప్పకూలే ప్రమాదం కూడా ఉంది. ఈ దందా గుట్టురట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు.

నగరంలోని మైలార్‌ దేవ్‌ పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వట్టేపల్లి, దుర్గానగర్‌ చౌరస్తా వద్ద డ్రగ్స్‌ విక్రయిస్తుండగా ఇద్దర్ని డ్రగ్స్ కంట్రోల్ అధికారులు, పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌ గా పట్టుకున్నారు. వీరిద్దరూ జిమ్ ట్రైనర్లుగా తేల్చారు. కొరియర్ ద్వారా ఢిల్లీ నుంచి ఈ ఇంజెక్షన్లు తెప్పిస్తున్నట్టు నిర్థారించారు. మరో నిందితుడ్ని అరెస్ట్ చేయాల్సి ఉంది.

హైదరాబాద్ ఫతేనగర్ లో హరిసేనాపతి అనే నిందితుడిని బాలానగర్ SOT, సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 33 రకాల టాబ్లెట్లు, ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ సుమారు 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు, చెన్నైకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు నిర్థారించారు. జిమ్ లు, చిన్న చిన్న క్లినిక్ లలో వీటిని విక్రయిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. కండలు పెంచేందుకు స్టెరాయిడ్స్ వాడితే అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరించారు డ్రగ్స్ కంట్రోల్ అధికారులు.

First Published:  19 Jun 2023 5:14 PM IST
Next Story