హైదరాబాద్‌లో జంట జలాశయాల ఉగ్రరూపం - మూసీ పరీవాహక ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించిన అధికారులు
హైదరాబాద్‌లోని జంట జలాశయాలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరాయి. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్న వరద ప్రభావంతో జలాశయాలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని జంట జలాశయాలు మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరాయి. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వస్తున్న వరద ప్రభావంతో జలాశయాలు ఉగ్రరూపం దాలుస్తున్నాయి. దీంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ నదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి పరిస్థితిలోనైనా అందుబాటులో ఉండాలని అన్ని శాఖల అధికారులనూ ఆదేశించారు.
హైదరాబాద్ శివారు ప్రాంతాలతో పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హిమాయత్‌సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరదల ప్రభావంతో మూసీ నది ఉరకలెత్తి ప్రవహిస్తోంది.
అంబర్‌పేట నుంచి దిల్‌సుఖ్‌నగర్ వెళ్లే దారిలో ముసారాం పేట్ బ్రిడ్జిని తాకేలా నీరు ప్రవహిస్తోంది. అంబర్‌పేట, మలక్‌పేట పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా గండిపేట జలాశయం ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్‌ఫ్లో 2 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2,748 క్యూసెక్కులు ఉంది. లోతట్టు ప్రాంత వాసులను అప్రమత్తం చేశారు.
హిమాయత్ సాగర్ జలాశయం వద్ద మూడు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2,500 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2,800 క్యూసెక్కులుగా ఉంది. ఈ నేపథ్యంలో రెండు జలాశయాల నుంచి మూసీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీనది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని కొన్ని కాలనీలవాసులను ఖాళీ చేయించారు.