Telugu Global
Telangana

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ.. 1800 మందికి ఉద్యోగాలు

శాండోజ్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.

Sandoz to set up global capability centre in Hyderabad
X

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ.. 1800 మందికి ఉద్యోగాలు

విశ్వనగరంగా మన్ననలు అందుకుంటున్న హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థ వచ్చింది. ఐటీ రంగంలోనే కాకుండా ఫార్మా హబ్‌గా నిలిచిన నగర కేంద్రంగా మరో లైఫ్ సైన్సెన్స్ దిగ్గజ కంపెనీ శాండోజ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నది.


శాండోజ్ కంపెనీ తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. శాండోజ్ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కార్యకలాపాలకు హైదరాబాద్ కేంద్రం నాలెడ్జ్ సర్వీసులను అందిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. శాండోజ్ సీఈవో రిచర్డ్ సెయ్‌నోర్ తన ప్రతినిధి బృందంతో మంగళవారం ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో సమావేశం అయ్యారు.

శాండోజ్ కంపెనీ హైదరాబాద్ కేంద్రంగా గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌ ఏర్పాటు చేయడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నగరంలో ఉన్న వ్యాపార అనుకూలత, మానవ వనరుల కారణంగా లైఫ్ సైన్సెస్ రంగం మరింతగా అభివృద్ధి సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.


ఇప్పటికే ప్రపంచదిగ్గజ సంస్థ నోవార్టిస్ తన రెండవ అతిపెద్ద కార్యాలయం హైదరాబాద్‌లో కలిగి ఉన్నదని.. ఇప్పడు శాండోజ్ కూడా ఇక్కడకు రావాలని నిర్ణయించుకోవడాన్ని స్వాగతించారు. తెలంగాణ ప్రభుత్వం లైఫ్ సైన్సెస్ రంగానికి అందిస్తున్న ప్రోత్సాహాన్ని, పరిశ్రమ అభివృద్ధి కోసం చేపడుతున్న భవిష్యత్ ప్రణాళికలపై కంపెనీ ప్రతినిధులకు మంత్రి ప్రెజెంటేషన్ ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీ గురించి వారికి కేటీఆర్ వివరించారు. శాండోజ్‌కు ఫార్మా సిటీ అద్భుతమైన పెట్టుబడిగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. శాండోజ్ తయారీ కేంద్రాని ఫార్మా సిటీలో ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాని కేటీఆర్ వారికి విజ్ఞప్తి చేశారు.


కాగా, నగరంలో ఉన్న లైఫ్ సైన్స్ అనుకూల అంశాల కారణంగానే తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.తొలుత 800 మందికి ఉద్యోగాలు ఇస్తామని.. తర్వాత 1800 వరకు పెంచుతామని వారు వెల్లడించారు. తమ గ్రూప్ కంపెనీ అయిన నోవార్టిస్ హైదరాబాద్ కేంద్రంగా భారీ ఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తోందని తెలిపారు.

తమ సంస్థ వెయ్యికి పైగా మాలిక్యుల్స్ కలిగి ఉందని, దాదాపు 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అర్జిస్తోందని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా తమ కంపెనీ విస్తరణ, భవిష్యత్ ప్రణాళికలకు అనుగుణంగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. తమకు తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు.



First Published:  31 Jan 2023 6:28 PM IST
Next Story