హైదరాబాద్ వాహనదారులకు భయమే లేదు.. 'ఆపరేషన్ రోప్'లో వెల్లడైన నిజాలు
నాగార్జున సర్కిల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాసాబ్ ట్యాంక్ వద్ద ఫ్రీ లెఫ్ట్ నిబంధనను చాలా మంది పాటించడం లేదని గుర్తించారు. ఇక్కడ రోడ్డు పూర్తిగా బ్లాక్ చేస్తుండటంతో ఇతర వాహనాలు ఎడమవైపు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు.
భారీగా ట్రాఫిక్ ఉండే మెట్రో నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నిత్యం లక్షలాది వాహనాలు రోడ్లపై తిరుగుతుంటాయి. ట్రాఫిక్ పోలీసులు కూడా అందుకు తగినట్లుగా ప్రతీ జంక్షన్లలో సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. నిత్యం ప్రత్యక్ష పర్యవేక్షణే కాకుండా, సీసీ కెమేరాల ద్వారా కూడా ట్రాఫిక్ కదలికపై నిఘా ఏర్పాటు చేశారు. అయితే హైదరాబాద్ వాహనదారులకు అసలు భయమే ఉండటం లేదని ట్రాఫిక్ విభాగం అధికారులు చెబుతున్నారు. ఏదైనా జంక్షన్‌లో పోలీసు సిబ్బంది ఉన్నప్పుడు మాత్రమే సిగ్నల్స్‌ను పాటిస్తున్నారని, లేకపోతే ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సెప్టెంబర్ నెలాఖరులో 'ఆపరేషన్ రోప్' అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ పరిధిలో ఏయే జంక్షన్లలో రద్దీ ఎక్కువగా ఉన్నది. ఫ్రీ లెఫ్ట్, స్టాప్ లైన్ క్రాసింగ్ వంటి నిబంధనలు ఏ మేరకు అమలు అవుతున్నాయో నిఘా పెట్టారు. గత మూడు వారాలుగా 'ఆపరేషన్ రోప్' ద్వారా పలు విషయాల ట్రాఫిక్ పోలీసులు దృష్టికి వచ్చాయి. ట్రాఫిక్ సాఫీగా సాగడానికి పెట్టిన ఫ్రీ లెఫ్ట్ నిబంధన సరిగా ఉపయోగపడటం లేదని తెలుస్తున్నది. ట్రాఫిక్ పోలీసులు ఉంటే వాహనదారులు సక్రమంగానే వ్యవహరిస్తున్నారు. కానీ పోలీసులు లేని చోట్ల ఫ్రీ లెఫ్ట్‌ను కూడా బ్లాక్ చేస్తూ వాహనాలు నిలుపుతున్నట్లు గుర్తించారు. అంతే కాకుండా విశాలమైన జంక్షన్లు ఉన్న దగ్గర వాహనదారులు.. ముఖ్యంగా ద్విచక్రవాహనాలు నడిపేవారు, స్టాప్ లైన్లు కూడా దాటేసి.. చుట్టూ గుంపులాగ చేరుతున్నారని.. దీంతో ఎదురుగా వచ్చే వాహనాలకు ఇబ్బందికరంగా మారుతున్నట్లు పోలీసులు చెప్పారు.
సిటీలో రద్దీగా ఉండే నాగార్జున సర్కిల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, మాసాబ్ ట్యాంక్ వద్ద ఫ్రీ లెఫ్ట్ నిబంధనను చాలా మంది పాటించడం లేదని గుర్తించారు. ఇక్కడ రోడ్డు పూర్తిగా బ్లాక్ చేస్తుండటంతో ఇతర వాహనాలు ఎడమవైపు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇక సంగీత్ జంక్షన్, ట్యాంక్ బండ్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జీపీవో జంక్షన్ల వద్ద స్టాప్ లైన్‌ను చాలా మంది దాటుతున్నట్లు గుర్తించారు. గత మూడు వారాలుగా ట్రాఫిక్ పోలీసులు ఆపరేషన్ రోప్‌లో అనేక మంది వాహనదారులు ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటి వరకు వీళ్లకు ఎలాంటి చలాన్లు విధించలేదు. కానీ ఈ రోజు నుంచి నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రతీ వాహనదారుడిని సీసీ కెమేరాలో గుర్తించి.. వారికి చలానాలు జారీ చేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు.
వాహనదారులకు ఫ్రీ లెఫ్ట్, స్టాప్ లైన్‌కు సంబంధించిన విషయాల్లో సోమవారం కేబీఆర్ పార్క్ జంక్షన్ (ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్) వద్ద పోలీసులు అవగాహన కల్పించారు. ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన నిబంధనలతో పాటు.. రాబోయే రోజుల్లో మరి కొన్ని ట్రాఫిక్ నిబంధనలు ఏర్పాటు చేయనున్నట్లు జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ చెప్పారు. వాహనదారులందరూ వెహికిల్స్‌కు సంబంధించిన అన్ని పత్రాలను వెంట ఉంచుకోవాలని ఆయన కోరారు. చాలా చోట్ల సిగ్నల్ సైక్లింగ్ టైమ్‌ను మార్చబోతున్నట్లు ఆయన వెల్లడించారు. తక్కువ టైం ఉండటం వల్ల సిగ్నల్ పడుతుందనే ఆత్రుతతో వాహనదారులు ఆయా జంక్షన్లలో స్టాప్ లైన్ దాటేసి చుట్టుముడుతున్నారని.. టైమ్ తక్కువగా ఉండటం వల్లే ఇలా జరుగుతున్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. కాబట్టి సిగ్నల్ టైం కొంచెం పెంచి వాహనాలు ఫ్రీగా వెళ్లేందుకు చర్యలు తీసుకుంటామని ఏవీ రంగనాథ్ చెప్పారు.