ఆడవాళ్లకు ఆర్టీసీ ఫ్రీ.. మెట్రోలో మగవాళ్లు హ్యాపీ
ఉదయం, సాయంత్రం ఆఫీస్ వేళల్లో మగవాళ్లు డ్యూటీలకు వెళ్లేందుకు మెట్రోలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఆడవారు మాత్రం కాస్త ఆలస్యమైనా ఆర్టీసీ ఉచిత సర్వీసుని ఉపయోగించుకుంటున్నారు.
హైదరాబాద్ మెట్రో రైళ్లలో ఇప్పుడు మహిళా ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఆడవాళ్లంతా ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఎక్కుతుండే సరికి మెట్రోలో మగవాళ్లే ఎక్కువగా కనపడుతున్నారు. మహిళల సీట్లలో కూడా మగవాళ్లే కూర్చుంటున్నారు. మెట్రోలో రద్దీ కాస్త తగ్గినా ఆ మేరకు మగవాళ్లు మెట్రోలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. లేడీస్ ఎక్కువగా లేకపోవడంతో సీట్లు కూడా దొరుకుతున్నాయని మగవాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెట్రో సిబ్బంది కూడా ఆర్టీసీలోనే..
మెట్రో రైళ్లు, రైల్వే స్టేషన్లలో పనిచేసే మహిళా సిబ్బంది కూడా ఇంటినుంచి పని ప్రదేశానికి రావడానికి ఆర్టీసీని ఉపయోగించుకోవడం విశేషం. ఆర్టీసీ బస్సులో ఉచితంగా వచ్చి మెట్రో స్టేషన్లలో ఉద్యోగాలు చేస్తున్నారు మహిళలు. రోజువారీ విధులకోసం వెళ్లే పేద, మధ్యతరగతి మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం నెలవారీ ఖర్చులను బాగానే సేవ్ చేస్తోంది. ఒక్కో మహిళకు 1200 రూపాయలనుంచి 1500 రూపాయల వరకు మిగులుతోందని అంటున్నారు.
పీక్ అవర్స్ లో మాత్రమే రద్దీ
మరోవైపు మెట్రో రైళ్లలో పీక్ అవర్స్ లో మాత్రమే రద్దీ కనపడుతోంది. అది కూడా మగవాళ్లు మాత్రమే మెట్రోలను ఆశ్రయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఆఫీస్ వేళల్లో మగవాళ్లు డ్యూటీలకు వెళ్లేందుకు మెట్రోలను ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఆడవారు మాత్రం కాస్త ఆలస్యమైనా ఆర్టీసీ ఉచిత సర్వీసుని ఉపయోగించుకుంటున్నారు. సరైన ధృవపత్రాలు లేనివారు, మరీ అర్జంట్ ప్రయాణాలు చేయాల్సిన మహిళలు మాత్రమే మెట్రో రైళ్లు లేదా ఇతర ప్రత్యామ్నాయాలు ఆశ్రయిస్తున్నారు.