హైదరాబాద్ మెట్రో: రద్దీ సమయాల్లో 2 నిమిషాలకో రైలు
Hyderabad Metro: రష్ ఎక్కువ కావడం వల్ల ట్రైన్ మిస్ అయినా, 2 నిమిషాల తర్వాత మరో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులకు మరింత సమయం ఆదా అవుతుంది. రద్దీ తగ్గిన తర్వాత తిరిగి యధావిధిగా రైళ్ల మధ్య గ్యాప్ పెరుగుతుంది.
రోజు రోజుకీ హైదరాబాద్ మెట్రోపై ప్రయాణికుల భారం పెరుగుతోంది. కరోనాకి ముందు గరిష్టంగా రోజుకి 4 లక్షలమంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేది మెట్రో. కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా చక్కబడటంతో ఇప్పుడు రోజుకి 4.5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు.
రద్దీ సమయాల్లో మెట్రోపై తాకిడి మరింత పెరుగుతుంది. కనీసం బోగీల్లో నిలబడటానికి కూడా చోటు ఉండని పరిస్థితి. అందుకే రద్దీ వేళల్లో ప్రతి 3 నిమిషాలకు ఒక ట్రైన్ నడుపుతుంటారు. ఇప్పుడీ సమయాన్ని మరింత తగ్గించేందుకు నిర్ణయం తీసుకుంది మెట్రో యాజమాన్యం.
2నిమిషాలకో ట్రైన్..
మెట్రో ప్రయాణికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకొని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ప్రస్తుతం రద్దీ వేళల్లో 3 నిమిషాలకో మెట్రో రైలు నడుస్తుండగా, ఆ గ్యాప్ ని ఇప్పుడు 2 నిమిషాలకు తగ్గించాలని సూచించారు.
మూడు మెట్రో కారిడార్లలో ఎక్కువగా ఐటీ కారిడార్ వెళ్లే నాగోల్-రాయదుర్గంతో పాటు ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో రద్దీ అధికంగా ఉంటుందని ఈ కారిడార్లలో రద్దీ సమయంలో ప్రతి 2 నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులో ఉంచాలని ఆయన చెప్పారు. అంటే రష్ ఎక్కువ కావడం వల్ల ట్రైన్ మిస్ అయినా, 2 నిమిషాల తర్వాత మరో ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ప్రయాణికులకు మరింత సమయం ఆదా అవుతుంది. రద్దీ తగ్గిన తర్వాత తిరిగి యధావిధిగా రైళ్ల మధ్య గ్యాప్ పెరుగుతుంది.
అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ వెళ్లే మార్గంలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల మధ్య రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ రూట్ లో షార్ట్ లూప్ సర్వీసులు నడపాలని సూచించారు.
షార్ట్ లూప్ విధానంలో ప్రతి 2 నిమిషాలకు ఒక రైలు నడిపితే రద్దీ నియత్రించవచ్చని మెట్రో అధికారులు భావిస్తున్నారు. మెట్రో రైలుకి అదనంగా కోచ్ లను పెంచే అవకాశం లేకపోవడంతో.. ట్రిప్పుల సంఖ్యను పెంచేందుకు ఆలోచన చేస్తున్నారు. టైమ్ టేబుల్ కచ్చితంగా పాటించేలా నిర్ణయం తీసుకుంటున్నారు.