Telugu Global
Telangana

కిటకిటలాడుతున్న హైదరాబాద్ మెట్రో.. 40 కోట్లు దాటిన ప్రయాణికుల సంఖ్య

మెట్రోలో ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం 4.9 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఒక్కోసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంటున్నట్లు తెలిపారు.

కిటకిటలాడుతున్న హైదరాబాద్ మెట్రో.. 40 కోట్లు దాటిన ప్రయాణికుల సంఖ్య
X

హైదరాబాద్ మెట్రో రైలుకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. మెట్రో సర్వీసులు నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. నగరంలో ట్రాఫిక్ పెరిగిపోవడంతో ప్రజా రవాణాను ఆశ్రయించే వారి సంఖ్య పెరుగుతోంది. తక్కువ సమయంలో గమ్యస్థానానికి చేరుకోవడానికి మెట్రో చాలా ఉపయోగపడుతోంది. దీంతో చాలా మంది మెట్రోను ఆశ్రయిస్తున్నారు. 2017 నవంబర్ 29న మెట్రో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 40 కోట్ల మంది ప్రయాణికులు ఈ సర్వీసును ఉపయోగించుకున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. మెట్రోలో ప్రస్తుతం సోమవారం నుంచి శుక్రవారం వరకు నిత్యం 4.9 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఒక్కోసారి ప్రయాణికుల సంఖ్య 5 లక్షలకు చేరుకుంటున్నట్లు తెలిపారు. ముఖ్యంగా రెడ్ లైన్‌లో ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. బ్లూ లైన్‌లో అమీర్‌పేట నుంచి రాయదుర్గం వరకు కూడా భారీగా ప్రయాణికుల సంఖ్య ఉంటున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి చెప్పారు.

మెట్రోలో ఎక్కువగా ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఐటీ ఉద్యోగులు రోజుకు 1.40 లక్షల మంది, విద్యార్థులు రోజుకు 1.20 లక్షల మంది వరకు ఉంటున్నారు. మెట్రో రైలులో యువత ఎక్కువగా ప్రయాణిస్తున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెట్రో పాస్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. కేవలం 20 ట్రిప్పులకు మాత్రమే చెల్లించి.. 30 ట్రిప్పులు ప్రయాణించ వచ్చని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు.


First Published:  2 July 2023 8:11 AM IST
Next Story