హైదరాబాద్ మెట్రో చార్జీలు పెంపు..! జనవరి 1 నుంచి అమలు..!!
Hyderabad Metro Charges Hike: ఇప్పుడు టికెట్ రేట్లు పెంచినా కూడా ఆదరణ తగ్గదని అంటున్నారు. హైదరాబాద్ మెట్రో మూడు లైన్ల ద్వారా ప్రతిరోజూ 4.20 లక్షల నుంచి 4.50 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది.
హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ల రేట్ల పెంపు జనవరి 1నుంచి అమలులోకి వచ్చే అవకాశముంది. ఈమేరకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని కొత్త ఏడాది నుంచి వీటిని అమలు చేస్తారని అంటున్నారు. 2 నెలల క్రితం ఏర్పాటైన 'ధరల నిర్ధారణ కమిటీ (FFC)' ప్రతిపాదనలు ఇప్పుడు పట్టాలెక్కబోతున్నాయి. ప్రజలనుంచి కూడా ఈ కమిటీ విజ్ఞప్తులు స్వీకరించింది. అనంతరం టికెట్ రేట్లను నిర్థారించింది. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచితే ఐదేళ్ల వరకు వీటిని సవరించే వీలుండదు.
మినిమమ్ చార్జీ రూ.20
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో లో మినిమమ్ చార్జి 10 రూపాయలుగా ఉంది. దీన్ని 20 రూపాయలు చేయబోతున్నారు. అలాగే గరిష్ట చార్జీ 60 రూపాయలుగా ఉంది. దీన్ని 80 రూపాయలు చేస్తారని తెలుస్తోంది. వీటితోపాటు ఇతర చార్జీలు కూడా కిలోమీటర్ల లెక్కన పెరగబోతున్నాయి. 5 రూపాయల చిల్లర సమస్య లేకుండా టికెట్ రేటుని రౌండ్ ఫిగర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పెంచినా ఆదరణ తగ్గదు..
హైదరాబాద్ మెట్రోకి అపూర్వ ఆదరణకు ప్రధాన కారణం రేట్లు తక్కువగా ఉండటం ఒక్కటే కాదు. ప్రశాంత ప్రయాణం కూడా. ప్రతి ఐదు నిముషాలకు ఒక ట్రైన్, ట్రాఫిక్ కష్టాలు లేని ప్రయాణం. నిలబడి ప్రయాణించినా గమ్యస్థానం ఎప్పుడు చేరుకుంటామో కచ్చితంగా తెలిసే అవకాశం.. ఇలాంటివన్నీ మెట్రోకి ఆదరణ పెంచాయి. ఇప్పుడు టికెట్ రేట్లు పెంచినా కూడా ఆదరణ తగ్గదని అంటున్నారు. హైదరాబాద్ మెట్రో మూడు లైన్ల ద్వారా ప్రతిరోజూ 4.20 లక్షల నుంచి 4.50 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తోంది. రేట్లు పెంచినా కూడా ప్రయాణికుల రద్దీ తగ్గదని ఎల్ అండ్ టి సంస్థ అంచనా వేస్తోంది.