కేసీఆర్ విజన్: కోటి జనాభాకు సరిపడేలా మెట్రో విస్తరణ
ఎయిర్ పోర్ట్ కారిడార్ లో 1.5 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా మెట్రో రైలు వస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రోలో రోజుకి 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని, ఈ ఏడాది చివరి నాటికి ఏడు లక్షల టార్గెట్ చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఎన్వీఎస్ రెడ్డి.
కేసీఆర్ విజన్ తో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మెట్రో విస్తరణ చేపడుతున్నట్టు తెలిపారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. కోటి జనాభాకు సరిపడేలా ఈ విస్తరణ ఉంటుందన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడమే ప్రధాన లక్ష్యమని చెప్పారాయన. ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నుమా మెట్రో పనులు త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్ కు మెట్రోను అనుసంధానిస్తామన్నారు. శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు 28 కిలోమీటర్ల మేర విస్తరించబోతున్నట్టు చెప్పారు.
ఉప్పల్ నుంచి బీబీనగర్ వరకు 25 కిలోమీటర్లు, తార్నాక నుంచి మౌలాలి వరకు ఐదుస్టేషన్లతో మెట్రో విస్తరిస్తామన్నారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. జేబీఎస్ నుంచి తూంకుంట వరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మిస్తామని అటు ప్యాట్నీ నుంచి కండ్లకోయ వరకు మెట్రోను విస్తరిస్తామన్నారు. భవిష్యత్ లో ఓఆర్‌ఆర్ చుట్టూ మెట్రో రైలు నిర్మాణం చేపడతామని చెప్పారు. ఇవన్నీ ప్రిలిమినరీ ప్రాజెక్టు రిపోర్ట్ (పీపీఆర్) దశలో ఉన్నాయని పేర్కొన్నారు. డిటెయిల్డ్ డీపీఆర్ ను త్వరలోనే తయారు చేస్తామని అన్నారు.
ఇక ఫేజ్-3లో 142 కిలోమీటర్లలో 68 స్టేషన్స్ ఉంటాయని పేర్కొన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఔటర్ రింగ్ రోడ్డు మెట్రో కోసం 158 కిలో మీటర్లలో మొత్తంలో 156కిలో మీటర్ల మార్గంలో మెట్రో రైల్ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఎయిర్ పోర్ట్ కారిడార్ లో 1.5 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెల్ ద్వారా మెట్రో రైలు వస్తుందని పేర్కొన్నారు. కంటోన్మెంట్ కూడా జీహెచ్ఎంసీలో కలిస్తే భూసేకరణకు కేంద్రం నుంచి అనుమతులు అవసరం లేదన్నారు. ప్రస్తుతం మెట్రోలో రోజుకి 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారని, ఈ ఏడాది చివరి నాటికి ఏడు లక్షల టార్గెట్ చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు ఎన్వీఎస్ రెడ్డి.