Telugu Global
Telangana

హైదరాబాద్‌ అంటేనే రాక్స్‌, లేక్స్‌, పార్క్స్‌

హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులతో కలిసి వివరించిన భట్టి

హైదరాబాద్‌ అంటేనే రాక్స్‌, లేక్స్‌, పార్క్స్‌
X

తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై అపోహలు సృష్టిస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తూ.. విపక్షాలు ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని మండిపడ్డారు. మాకు ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనే తప్ప ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదని భట్టి తెలిపారు. సెక్రటేరియట్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2014-2023 మధ్య కాలంలో హైదరాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన చెరువుల వివరాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులతో కలిసి భట్టి వివరించారు.

ఇప్పటికైనా చెరువుల ఆక్రమణ ఆపాలి

మాది ప్రజా ప్రభుత్వం, పారదర్శకమైన ప్రభుత్వమని భట్టి అన్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాయి. హైదరాబాద్‌లోని చెరువులు ప్రజల ఆస్తి. హైదరాబాద్‌ అంటేనే రాక్స్‌, లేక్స్‌, పార్క్స్‌ అని తెలిపారు. ఇవి హైదరాబాద్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చాయి. నగరంలో గత కొన్నేండ్లుగా చెరువులు మాయమవుతున్నాయి. మూసీని ఆధునికీకరించాలని గతంలో చాలా ప్రయత్నాలు జరిగాయన్నారు. శాటిలైట్‌ మ్యాప్‌ల ద్వారా చెరువుల ఆక్రమణలను గుర్తిస్తున్నామని భట్టి చెప్పారు. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఎన్ని చెరువులు ఉన్నాయి.. ఇప్పుడెన్ని ఉన్నాయి అనే వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. హైడ్రాను తీసుకొచ్చింది ముఖ్యమంత్రి కోసమో, మంత్రుల కోసమో కాదు కదా! చెరువులు అన్యాక్రాంతం కాకుండా కొత్త నిబంధనలు తెచ్చామన్నారు. చెరువులను భవిష్యత్తు తరాలకు అందించాలన్నారు. ఇప్పటికైనా చెరువుల ఆక్రమణ ఆపాలన్నారు. మూసీలో మంచినీళ్లు లేకుండా డ్రైనేజీగా మార్చేశామన్నారు. గతంలో ఇతర దేశాల్లోనూ నదులు డ్రైనేజీల్లా ఉండేవని.. వాళ్లు మార్చుకున్నారు. ఇతర దేశాల నదులు ఆస్తులుగా మార్చుకున్నాయని వివరించారు.

పొరపాట్లు జరిగితే సరిచేసుకోవడానికి తాము సిద్ధం

మూసీ సుందరీకరణకు రూ. 1.50 లక్షల కోట్లు ఖర్చవుతుందని ప్రతిపక్షాలు అంటున్నాయి. టెండర్లే పిలువకుండా రూ. లక్షన్నర కోట్లు ఎలా అవుతుందని చెబుతారు? మూసీ సుందరీకరణ అంశంపై ప్రతిపక్షాలు తమ ఆలోచనలు ప్రభుత్వానికి తెలియజేయాలని కోరారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఎవరికీ ఇబ్బంది కలిగించమని భట్టి చెప్పారు. ఇళ్లను తొలిగించిన బాధితులకు వేరే చోట ఇళ్లు ఇస్తున్నాం. ప్రజలకు మేలు జరగకూడదనే విపక్షాల అజెండా అని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి ప్రతిపక్షాలు సలహాలు ఇవ్వాలి. పాలనలో చిన్న చిన్న పొరపాట్లు జరిగితే సరిచేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని భట్టి అన్నారు.

డిప్యూటీ సీఎం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించిన జలవనరుల ఆక్రమణలపై నివేదిక కోసం కింది లింక్‌ క్లిక్‌ చేయండి.

https://www.teluguglobal.com/pdf_upload/report-on-waterbodies-encroachment-a3-07-10-2024pptx-1366979.pdf


First Published:  7 Oct 2024 12:16 PM GMT
Next Story