Telugu Global
Telangana

భారత్ లోనే అతి పెద్ద లులు మాల్.. హైదరాబాద్ లో ఈనెల 27న ప్రారంభం

ఈనెల 27న లులు మాల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మాల్ ఏర్పాటుతో దేశంలో ఇదే అతిపెద్ద లులు షాపింగ్ మాల్ కాబోతోంది.

భారత్ లోనే అతి పెద్ద లులు మాల్.. హైదరాబాద్ లో ఈనెల 27న ప్రారంభం
X

300 కోట్ల రూపాయల పెట్టుబడి

5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్

2 లక్షల చదరపు అడుగుల్లో హైపర్‌ మార్కెట్‌

5 భారీ మల్టీప్లెక్స్ స్క్రీన్ లు, అతి పెద్ద ఫుడ్ కోర్ట్, గేమింగ్ జోన్స్

75కిపైగా అంతర్జాతీయ బ్రాండెడ్ షోరూమ్ లు

2వేలమంది ఉద్యోగులు

హైదరాబాద్ కూకట్ పల్లిలో లులు గ్రూప్ ఏర్పాటు చేస్తున్న మాల్ విశేషాలివి. ఈనెల 27న లులు మాల్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మాల్ ఏర్పాటుతో దేశంలో ఇదే అతిపెద్ద లులు షాపింగ్ మాల్ కాబోతోంది. కూకట్ పల్లిలోని మంజీరా మాల్ ని పునరుద్ధరించి లులు మాల్ ఏర్పాటు చేశారు.

భారత్ లో ఇప్పటికే లులు గ్రూప్ కి చెందిన 5 అతి పెద్ద మాల్స్ ఉన్నాయి. కూకట్ పల్లిలో ఏర్పాటు చేసేది ఆరోది, అతి పెద్దది. యూఏఈ కేంద్రంగా ఉన్న ప్రముఖ అంతర్జాతీయ సంస్థ లులు హైదరాబాద్ లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అందులో లులు మాల్ ఒకటి. రోజుకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో చెంగిచెర్ల వద్ద మాంసం శుద్ధీకరణ పరిశ్రమకు ఏర్పాటు చేయబోతోంది లులు సంస్థ. ఇందులో 2500 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. రూ. 2వేల కోట్లతో హైదరాబాద్‌లో 22 లక్షల చదరపు అడుగుల్లో డెస్టినేషన్‌ షాపింగ్‌ మాల్‌ కి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెయ్యి కోట్ల వ్యయంతో తెలంగాణలోని ఇతర నగరాల్లో మినీ మాల్స్‌ ఏర్పాటు చేయబోతున్నారు. వచ్చే ఐదేళ్లలో మొత్తం రూ.3500 కోట్ల పెట్టుబడులు తెలంగాణలో పెట్టేందుకు లులు సంస్థ ఒప్పందాలు ఖరారు చేసుకుంది.

ప్రపంచవ్యాప్తంగా లులు సంస్థకు 22 దేశాల్లో 250 హైపర్‌ మార్కెట్లు ఉన్నాయి. తెలంగాణ బియ్యాన్ని, మాంసాన్ని ఎగుమతి చేసి వాటిద్వారా విక్రయిస్తామని లులు గ్రూప్ గతంలోనే ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ ఇప్పటి వరకు 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. మూడేళ్లలో మరో 10వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

First Published:  23 Sept 2023 1:55 PM IST
Next Story