Telugu Global
Telangana

హైదరాబాద్ కు మళ్లీ ముప్పు.. 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్..

భారీ వర్షాలకు మరోసారి హుస్సేన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. హైదరాబాద్‌ నగర శివారు బాచుపల్లిలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

హైదరాబాద్ కు మళ్లీ ముప్పు.. 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్..
X

తెలంగాణపై వరుణుడు పగబట్టాడా అన్నట్టుగా భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల వారం రోజులు ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు ప్రజలు తీవ్ర స్థాయిలో నష్టపోయారు. ఇప్పుడిప్పుడే పరిస్థితి కుదుటపడుతున్న తరుణంలో మరోసారి భారీ వర్షాలు మొదలయ్యాయి. మరో నాలుగు రోజులపాటు కుండపోత తప్పదని హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. గోదారమ్మ శాంతించింది, వరద ప్రవాహం తగ్గిపోతోందనుకుంటున్న సమయంలో భారీ వర్షాలతో తీర ప్రాంతవాసులు మళ్లీ హడలిపోతున్నారు.

హైదరాబాద్ అష్టదిగ్బంధం..

హైదరాబాద్ లో ఎటు చూసినా వరద నీరే. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు భాగ్య నగరంలో గ్యాప్ లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ తో పాటు మహబూబాబాద్‌, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు అధికారులు. హైదరాబాద్‌ లో సుమారు 2 వేల కాలనీలు నీట మునిగాయని జీహెచ్‌ఎంసీ అంచనా వేసింది. నిజాంపేట, కుత్బుల్లాపూర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నిజాంపేట బండారి లేఅవుట్‌, బృందావన్‌ కాలనీ, బాలాజీనగర్‌, శ్రీనివాసకాలనీ, బాచుపల్లి, రాజీవ్‌ గాంధీనగర్‌, జయదీపికా ఎస్టేట్‌ తదితర ప్రాంతాలు లంక గ్రామాలను తలపించాయి. భారీ వర్షాలకు మరోసారి హుస్సేన్‌సాగర్‌ పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకుంది. హైదరాబాద్‌ నగర శివారు బాచుపల్లిలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అటు దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లిలో ఏకంగా 21 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. దేవరుప్పలలో 20.6 సెంటీమీటర్లు, కరకగూడెంలో 17.1 నెల్లి కుదురులో 15.6 సెంటీమీటర్ల భారీ వర్షపాతం కురిసింది. ఒడిశా ఉత్తర ప్రాంతంపై ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు కురిశాయని చెబుతున్నారు అధికారులు. అయితే దీన్ని అంచనా వేయడం కష్టమైందని, అందుకే శుక్రవారం భారీ వర్షాలపై గురువారం కూడా హెచ్చరికలు చేయలేకపోయామని వివరించారు. ఇప్పటినుంచి మరో నాలుగు రోజులపాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశముందని మాత్రం హెచ్చరించారు.

First Published:  23 July 2022 7:43 AM IST
Next Story