Telugu Global
Telangana

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌కు హైదరాబాద్ అడ్డా : ఐఐసీ వైస్ ప్రెసిడెంట్

అమెరికాలో సాంకేతిక విప్లవం మొగ్గ తొడగడానికి భారతీయులు కూడా ప్రధాన కారణమని ఐఐసీ వైస్ ప్రెసిడెంట్ లాఫ్రాన్స్ అన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌కు హైదరాబాద్ అడ్డా : ఐఐసీ వైస్ ప్రెసిడెంట్
X

హైదరాబాద్ నగరంలో ఉన్న అద్భుతమైన మౌలిక సదుపాయాలు, అందుబాటులో నైపుణ్యం కలిగిన మాన వనరుల కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ రంగాల్లో వేగంగా ఎదుగుతున్నది. అతి త్వరలోనే ఈ నగరం ఏఐ, రోబోటిక్స్‌కు అడ్డాగా మారుతుందని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యునికేషన్స్ వైస్ ప్రెసిడెంట్ ఆన్ లాఫ్రాన్స్ తెలిపారు. అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన సదస్సులో ఆమె హైదరాబాద్ నగరం దేశ టెక్ రాజధానిగా ఎలా ఎదుగుతున్నదో వివరించారు. హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, డేటా ప్రొటెక్షన్ వంటి వినూత్న రంగాల్లో అపారమైన అభివృద్ధిని సాధించిందని అమెరికాకు చెందిన టెక్ నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో సాంకేతిక విప్లవం మొగ్గ తొడగడానికి భారతీయులు కూడా ప్రధాన కారణమని ఐఐసీ వైస్ ప్రెసిడెంట్ లాఫ్రాన్స్ అన్నారు. అమెరికాలోని చాలా టెక్ కంపెనీలకు భారతీయులే సీఈవోలుగా ఉన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు. అమెజాన్, గూగుల్, ఫేస్‌బుక్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికా సంస్థలు హైదరాబాద్ నగరంలో తమ ప్రధాన శాఖలు ఏర్పాటు చేసిన విషయాన్ని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందుతున్నదని.. దీన్ని టెక్నాలజీ హబ్ ఆఫ్ ఇండియాగా కూడా పిలవొచ్చని అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ నగరంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయి. అలాగే అద్భుతమైన మౌలిక సదుపాయాలు కూడా ఉండటంతో ఏఐ, రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ తదితర రంగాల్లో హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున పెట్టుబడులు తరలి వస్తాయని ఆమె పేర్కొన్నారు. కాగా, తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర ఐటీ రంగ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. తొమ్మిదేళ్లలోనే ఐటీ ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి లభిస్తున్నది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 20 పైగా ఎమ్ఎన్‌సీలు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయి. దీనంతటికీ కారణం సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ అని చెప్పక తప్పదు.

First Published:  14 Sept 2023 6:01 AM IST
Next Story