Telugu Global
Telangana

100 శాతం ఎస్టీపీలతో దేశంలోనే హైదరాబాద్ మొట్టమొదటి నగరం కాబోతోంది : మంత్రి కేటీఆర్

చిత్తశుద్ధి ఉంటే ఏమైనా చేయవచ్చు.. 50 ఏళ్ల అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మరి ఇప్పుడు అవకాశం ఇమ్మని ఎలా కోరుతున్నారని కాంగ్రెస్ పార్టీని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

100 శాతం ఎస్టీపీలతో దేశంలోనే హైదరాబాద్ మొట్టమొదటి నగరం కాబోతోంది : మంత్రి కేటీఆర్
X

హైదరాబాద్ మహా నగరంలో ప్రతీ రోజు దాదాపు 2వేల ఎంఎల్‌డీ మురికి నీరు ఉత్పత్తి అవుతోంది. దీని వల్ల నగరం, చుట్టుపక్కల చెరువులు, కుంటలు, నది కలుషితం కాకుండా పూర్తి స్థాయిలో మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ - ఎస్టీపీ)లను ఏర్పాటు చేస్తున్నాము. ఈ జూలై నాటికి 100 శాతం ఎస్టీపీలతో దేశంలోనే మొట్ట మొదటి నగరంగా హైదరాబాద్ నిలవనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ పని దేశానికే ఆదర్శం కాబోతోందని.. ఇందు కోసం రూ.4వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. నగర శివారు జవహర్ నగర్‌లో ఏర్పాటు చేసిన లీషెట్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను శనివారం మంత్రి మల్లారెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

జవహర్‌నగర్ దుర్గంధ సమస్యను గత ప్రభుత్వాలు మాకు వారసత్వంగా ఇచ్చాయి. చిత్తశుద్ధి ఉంటే ఏమైనా చేయవచ్చు.. 50 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయలేదు. మరి ఇప్పుడు అవకాశం ఇమ్మని ఎలా కోరుతున్నారని కాంగ్రెస్ పార్టీని మంత్రి కేటీఆర్ విమర్శించారు. నగరంలో పేరుకొని పోతున్న చెత్తను తరలించడానికి జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డు అయితే పెట్టారు. కానీ ఆ తర్వాత ఏం చేయాలనే విషయంపై ఎలాంటి ఆలోచన చేయలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇక్కడి చెత్త కారణంగా చుట్టు పక్కల ఉండే వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి.

2014లో సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత జవహర్‌నగర్‌ పరిస్థితిపై పూర్తిగా అధ్యయనం చేశారు. ఇక్కడ గుట్టలుగా లక్షల టన్నుల వరకు పేరుకొని పోయిన చెత్తను ఏం చేస్తే ప్రజలకు ఉపశమనం కలుగుతుందని ఆలోచించారు. శాస్త్రీయంగా ఏం చేయవచ్చో ఆ పద్దతులపై అధ్యయనం చేయాలని కోరారు. అప్పుడే దీనిపై లెక్కలు తీసుకొని కసరత్తు మొదల పెట్టామని కేటీఆర్ అన్నారు. ఆనాడు కేవలం 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందనే అంచనాతో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారు. కానీ ఇవ్వాళ దాదాపు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త ఇక్కడ డంప్ చేస్తున్నారు. అందుకే ఈ చెత్తను సమూలంగా ఇక్కడ నుంచి కనుమరుగు చేయడానికి పలు పద్దతులు అవలంభిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

ఇక్కడకు వచ్చే తడి చెత్తతో ఎరువులు తయారు చేసి రైతులకు అమ్ముతున్నాము. ఇక పొడి చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేస్తున్నాము. రూ.550 కోట్లతో దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే యూనిట్ ఇక్కడ నెలకొల్పాము. ప్రస్తుతం 20 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. రాబోయే రోజుల్లో మరో రూ.550 కోట్లతో ఇంకో 28 మెగావాట్ల విద్యుత్ కేంద్రం స్థాపించబడుతోందని కేటీఆర్ చెప్పారు. ఒక్క జవహర్‌నగర్ నుంచే 48 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాబోతోంది. హైదరాబాద్ నగరంలోని చెత్తతో రోజుకు 100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

ఇక ఇళ్ల నిర్మాణాలు, కూల్చి వేతల సమయంలో పోగయ్యే శిథిలాల కారణంగా నాలాలు, కాల్వలు పూడిపోతున్నాయి. అందుకే అలాంటి శిథిలాలను పోగేసి సిమెంట్, ఇటుక, టైల్స్ వంటివి తయారు చేస్తున్నాము. ఇప్పటికే రెండు ప్లాంట్స్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో మరో రెండు ప్లాంట్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఈ రోజు ప్రారంభించిన లీషెట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా పక్కనే ఉన్న మల్కారం చెరువు పూర్తిగా శుద్ధి కాబోతోందని.. ఇకపై జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నాగారం ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని మంత్రి చెప్పారు. జల, వాయు కాలుష్యం పూర్తిగా అరికట్ట బడుతుందని అన్నారు. లీషెట్ ట్రీట్మెంట్ ప్లాంట్, విద్యుత్ కేంద్రం, ఇటుకల తయారీ, ఎరువుల తయారీ వల్ల ఇకపై చెత్త కూడా పేరుకొని పోయే అవకాశం ఉండదని కేటీఆర్ పేర్కొన్నారు.

త్వరలోనే జవహర్‌నగర్‌లో పార్క్‌తో పాటు వైకుంఠధామం, ఖబరస్తాన్, సిమెట్రీలను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం జీవో 58 లబ్ధిదారులు 3వేల మందికి పైగా మంత్రి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు.


First Published:  15 April 2023 4:07 PM IST
Next Story