జాత్యాహంకార ప్రవర్తనకు హైదరాబాద్ ఐకియా క్షమాపణలు చెప్పాలి -కేటీఆర్ డిమాండ్
తన భార్యపట్ల హైదరాబాద్ ఐకియా స్టోర్ సిబ్బంది జాత్యాహంకారాన్ని ప్రదర్శించారని మణిపూర్ కు చెందిన ఓ నెటిజన్ ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ కు కేటీఆర్ స్పంధించారు. ఐకియా వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లోని ఐకియా షో రూంలో జరిగిన జాత్యాహంకార సంఘటన పట్ల మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పంధించారు. ''మీరు అవమానించిన జంటకు క్షమాపణలు చెప్పండి. మీ వినియోగదారులందరినీ గౌరవించేలా మీ సిబ్బందికి అవగాహన కల్పించండి, శిక్షణ ఇవ్వండి'' అని ట్వీట్ చేశారు.
అసలేం జరిగిందంటే.... నితిన్ సేథీ అనే వ్యక్తి తన భార్యకు ఐకియాలో జరిగిన అవమానం గురించి ట్వీట్ చేశారు.
''హైదరాబాద్‌లోని ఐకియా ఇండియా స్టోర్ లో అందరినీ వదిలేసి నా భార్య కొనుగోలు చేసిన వస్తువులను అనేక సార్లు పరీక్షించారు. అందరూ వెళ్ళిపోయే దాకా ఆమెను అక్కడే నిలబెట్టారు. అక్కడున్న సిబ్బంది అందరూ నా భార్య పట్లజాత్యాహంకారాన్ని ప్రదర్శించారు. వ్యంగ్యంగా, ఎగతాళిగా నవ్వుతూ మాట్లాడారు.
నా భార్య షాపింగ్ బ్యాగ్‌లను తనిఖీ చేసిన వ్యక్తి, మీరు ఇన్ని వస్తువులను ఎందుకు కొన్నారు అంటూ నవ్వాడు. అందరినీ పంపించేసి మమ్మల్ని ఎందుకు ఒంటరిగా ఉంచారు అని అడిగినా సమాధానం ఇవ్వలేదు. మేము ఇలానే వ్యవహరిస్తాం మీకు కావాలంటే పోలీసులను పిలవండి అని సూపర్‌వైజర్లు అన్నారు. ఇటువంటి జాత్యాహంకారం మేము రోజూ ఎదుర్కొంటున్నాం'' అని ట్వీట్ చేశారాయన.
ఈ ట్వీట్ ను షేర్ చేసిన కేటీఆర్ ఐకియా సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంత మాత్రం ఆమోదించలేని ఈ ప్రవర్తన భయంకరమైనది అని కేటీఆర్ కామెంట్ చేశారు.
This is appalling and absolutely unacceptable @IKEAIndia
— KTR (@KTRTRS) August 29, 2022
Please ensure a proper apology is issued & more importantly educate, sensitise & train your staff to respect all your customers graciously
Hope you will make amends asap https://t.co/l84GimoIrM
దీనిపై స్పంధించిన ఐకియా.. " సమానత్వం మానవ హక్కు అని మేము విశ్వసిస్తాము. మేము అన్ని రకాల జాత్యహంకారం, పక్షపాతాలను ఖండిస్తున్నాము. బిల్లింగ్ ప్రోటోకాల్‌ను అనుసరిస్తున్నప్పుడు ఫైనల్ చెకింగ్ లో మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము.'' అని ట్వీట్ చేసింది ఐకియా.
అయితే.. ఈ సమర్థన ఏమాత్రం సమంజసంగా లేదని నితిన్ సేథి భార్య ట్వీట్ చేశారు. కేవలం ఫైనల్ చెకింగ్ అయి ఉంటే తాను ఇక్కడ ట్వీట్ చేయాల్సిన పరిస్థితి రాదని.. పూర్తిగా తనకు ఎదురైన చేదు అనుభవం గురించి తెలుసుకోకుండా ఇలా సమాధానం ఇవ్వడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ స్పందన మీ కంపెనీ బాధ్యతరాహిత్యాన్ని రుజువు చేసేలా ఉందని ఆమె ట్వీట్ చేశారు.