Telugu Global
Telangana

వాహన యజమానులకు హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్..

దేశంలో అతి తక్కువ వాహన చోరీ కేసులు నమోదవుతున్న నగరం హైదరాబాద్. హైదరాబాద్ తో పాటు, ముంబై, కోల్ కతా కి కూడా ఈ బెడద తక్కువ.

వాహన యజమానులకు హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్..
X

హైదరాబాద్ ఐటీలో గొప్ప అనే విషయం తెలిసిందే, కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ, కంపెనీలకు అనుకూలం. చిన్నారులు, మహిళలపై జరిగే నేరాలు కూడా ఇక్కడ తక్కువే. ఇన్ని సానుకూల అంశాలకు తోడు ఇప్పుడు మరో ఆసక్తికరమైన విశ్లేషణ కూడా హైదరాబాద్ ని టాప్ ప్లేస్ లో నిలబెట్టింది. దేశవ్యాప్తంగా వాహనాల చోరీలు హైదరాబాద్ లోనే తక్కువగా జరుగుతున్నాయట. ACKO ఇన్సూరెన్స్ కంపెనీ చేపట్టిన సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వాహనాల యజమానులకు హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ అనే ఘనత దక్కింది.

ఎక్కువ దొంగతనాలు ఎక్కడంటే..?

దేశ రాజధాని ఢిల్లీలో వాహనాల దొంగతనం ఎక్కువగా జరుగుతుందని ఇన్సూరెన్స్ కంపెనీ చేపట్టిన సర్వేలో తేలింది. దేశవ్యాప్తంగా వాహన చోరీల లెక్క తీస్తే 56శాతం ఢిల్లీలోనే జరుగుతున్నాయి. ఢిల్లీ పోలీసుల అధికారిక లెక్కల ప్రకారం 2011 నుంచి 2020 మధ్యకాలంలో 3లక్షల వాహనాలు చోరీకి గురయ్యాయి. ఢిల్లీలో నమోదవుతోన్న మొత్తం కేసుల్లో 20శాతం వాహనాల దొంగతనానికి సంబంధించినవే కావడం విశేషం. ఢిల్లీలో ప్రతి 12నిమిషాలకు ఒక వాహనం మాయమైపోతుందట. ఆ తర్వాత ఆ ఘనత బెంగళూరుకి దక్కింది. మూడో స్థానం చెన్నైది. దేశవ్యాప్తంగా వాహనాల చోరీ కేసుల్లో 9శాతం బెంగళూరులో, 5శాతం చెన్నైలో నమోదవుతున్నాయి.

కారణం ఏంటి.. ?

పార్కింగ్ ప్లేస్ లేకపోవడం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఢిల్లీలో అపార్ట్ మెంట్ల లో కూడా పార్కింగ్ ప్లేస్ సరిగా ఉండదు. అందుకే అందరూ రోడ్ల పక్కనే వాహనాలు పార్కింగ్ చేస్తుంటారు. సీసీ కెమెరాలు పెట్టుకున్నా, ఒకటికి పదిసార్లు లాక్ పడిందా లేదా అని చెక్ చేసుకున్నా పోయే వాహనాలు పోక మానవు. ప్రతి 12 నిముషాలకు ఒక వాహనం మిస్సవుతుంది, ఒక యజమాని పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నాడు. అందుకే దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ ఎక్కువగా ఉన్న నగరంగా ఢిల్లీ రికార్డులకెక్కింది.

హైదరాబాద్ సేఫ్..

దేశవ్యాప్తంగా అతి తక్కువ వాహన చోరీ కేసులు నమోదవుతున్న నగరం హైదరాబాద్. హైదరాబాద్ తో పాటు, ముంబై, కోల్ కతా కి కూడా ఈ బెడద తక్కువ. అంటే హైదరాబాద్ లో వాహనం రోడ్డు పక్కన పార్కింగ్ చేసినా హాయిగా నిద్రపోవచ్చనమాట. ఢిల్లీలో కారులోనే పడుకున్నా.. తెల్లారే సరికి కారుతోపాటు మనం కూడా మాయమైపోవచ్చనమాట.

First Published:  18 Oct 2022 7:21 AM IST
Next Story